Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం..ధనస్సు రాశి జాతకం
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో ధనస్సు రాశివారికి ఈ సంవత్సరం మొదట్లో శని మరియు కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో శని గోచారం కుటుంబ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
Sagittarius
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
Sagittarius
ఉద్యోగం
ధనూ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం సామాన్య ఫలితాలను ఇస్తుంది. గురు గోచారం సంవత్సరమంతా 4 వ ఇంటిలో ఉండటం, రాహు గోచారం ఐదవ ఇంట ఉండటం వలన వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు. శని గోచారం రెండవ మరియు మూడవ ఇంట ఉండటం, కేతు గోచారం 11వ ఇంట ఉండటం వలన ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో మరియు కుటుంబ విషయం గా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వృత్తి పరంగా కొంత ఉంటుంది. ఈ సంవత్సరమంతా గురు గోచారం 4వ ఇంట ఉండటం వలనవృత్తిలో శ్రమ అధికంగా ఉంటుంది. చాలా సార్లు చేసిన పనులనే మళ్లీమళ్లీ చేయాల్సిరావటం, ఎంత పని చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవటం వలన మానసిక ఒత్తిడికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతారు. ఉద్యోగంలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వచ్చిన మార్పు మీకు కొంత ఇబ్బందిని, పని ఒత్తిడిని ఇస్తుంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన మార్పు కనక మీరు అక్కడ మనస్ఫూర్తిగా పని చేయలేక పోవచ్చు. అంతేకాకుండా సహోద్యోగుల సహకారం కూడా లేకపోవడం వలన ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్యలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉత్సాహంగా మీపని మీరు చేసుకోగలుగుతారు.. మీరు పట్టుదలగా ఉంది ప్రయత్నం చేస్తే ఉద్యోగులతో ఉన్న సమస్యలు తొలగిపోయి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అంతే కాకుండా మీరు తిరిగి గతంలో ఉద్యోగం చేసిన ప్రాంతానికి రావడం కానీ, లేదా చేసే బాధ్యతల్లో మార్పులు రావటం వలన వృత్తిలో ఉండే ఒత్తిడి కొంత తగ్గుతుంది. ఈ సమయంలో గతంలో వాయిదా పడిన పనులు పూర్తి అవడం కానీ, గతంలో ఆగిపోయిన పదోన్నతి తిరిగి రావటానికి కానీ జరుగుతుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం తిరిగి రెండవ ఇంటికి మారటం, అలాగే గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన మీ ఉద్యోగంలో తిరిగి ఒత్తిడి పెరగడం జరుగుతుంది. ఈ సమయములో మీ స్థాయికి మించిన పనులను చేయకుండా ఉండటం మంచిది. గొప్పలకు పోయి ఇలాంటి పనులు చేయడానికి ముందుకు వచ్చి ఆ తర్వాత వాటిని చేయలేక ఇతరుల దృష్టిలో తక్కువ కావడం జరగవచ్చు. రాహువు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన కొన్నిసార్లు అత్యుత్సాహంగా ఉండటం, కొన్ని సార్లు నిరుత్సాహంతో ఉంటారు. మానసిక ఒత్తిడి కారణంగా పనులు వాయిదా వేయాలని చూస్తుంటారు. చేసే పనికి కొన్నిసార్లు గుర్తింపు రాకపోవడంతో ఆ పని మానేయాలని ఆలోచిస్తారు. ఈ సమయంలో వీలైనంతవరకూ మీ పై మీరు నమ్మకం కలిగిఉండి పని చేయడం వలన విజయం సాధిస్తారు. కొన్నిసార్లు ఒకే పనిని చాలా సార్లు చేస్తే కానీ పూర్తవక పోవచ్చు కాబట్టి అటువంటి సందర్భాల్లో నిరాశకు లోను కాకుండా పని చేయటం వలన ఆ పని పూర్తి చేయగలుగుతారు.
Sagittarius
ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం ధను రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి తగ్గుతుంది. రెండవ ఇంటిని శని గోచారం కారణంగా ఆదాయం తగ్గి పోవడం కానీ లేదా ఖర్చు పెరగడం కానీ జరగవచ్చు. సంవత్సరమంతా గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన కుటుంబ కారణాల రీత్యా కాని, కోర్టు కేసులు లేదా వివాదాల కారణంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. గొప్పలకు పోయి వినోద కార్యక్రమాలకు, వ్యసనాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలయినంత వరకు ఈ సమయంలో గొప్పలకు పోకుండా, ఇతరుల మాటలకు లొంగకుండా ఉండటం మంచిది.
ఆరోగ్యం
ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం, సంవత్సరం మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన నేత్ర సంబంధ, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు అధిక శ్రమ కారణంగా, మరియు సమయానికి భోజనం చేయకపోవడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన గురు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం, సంవత్సరమంతా కేతుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య పరంగా పెద్దగా సమస్యలు ఉండవు. సంవత్సరం మధ్యలో శని మరియు గురువు గోచారం బాగుండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విశ్రాంతి లేకుండా పని చేయడం, ఎక్కువ ప్రయాణాల కారణంగా సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు, దంతములు, కాలేయము మరియు మోకాళ్ల కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది .
Sagittarius
కుటుంబం
ధను రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా గురు గోచారం మరియు సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో శని మరియు కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో శని గోచారం కుటుంబ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మీ మాటకు విలువ తగ్గడం కానీ, మీరు చెప్పిన విషయాలు కుటుంబ సభ్యులు పాటించకపోవడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అనవసరమైన వివాదాలు పోకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీకు ఆవేశాన్ని మరియు కోపాన్ని కలిగించే సంఘటనలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. మీ ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కుటుంబ సభ్యులతో వివాదాలు పెరగడం కానీ, వారికి దూరం అవ్వటం కానీ జరగవచ్చు. సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు బంధువుల సహాయంతో తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఉద్యోగ రీత్యా కాని ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరమంతా కేతు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే తగ్గుముఖం పడతాయి. అలాగే అయిదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా, సంతానం మంచి అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ, వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Sagittarius Horoscope
వ్యాపారం మరియు స్వయం ఉపాధి
ఈ సంవత్సరం ధను రాశి లో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా లేకపోవటం వలన, ఈ సమయంలో తప్పనిసరిగా వ్యాపారం ప్రారంభించాలి వస్తే సంవత్సరం ఆరంభంలో కాని, చివరలో కానీ శని గోచారం మూడవ ఇంటిలో ఉండే సమయంలో ప్రారంభించడం కొంత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా లేనప్పటికీ ఆరంభంలో, చివరలో శని గోచారం బాగుండటం వలన వ్యాపార వృద్ధి సాధ్యమవుతుంది. అయితే వ్యాపారం లో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆదాయం పరంగా కొంత సామాన్యంగానే ఉంటుంది. గురువు, మరియు రాహు గోచారం సామాన్యం గా ఉండటం వలన వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. అయితే ఈ సమయంలో కేతు గోచారం 11వ ఇంటిలో అనుకూలంగా ఉండటం ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. గతంలో రావలసిన డబ్బులు రావడం కానీ, భాగస్వామ్య ఒప్పందం కారణంగా ఆర్థిక భారం తగ్గడం కానీ జరుగుతుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ, కళాకారులు కానీ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం బద్ధకం లేదా నిర్లక్ష్యం కారణంగా వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోక పోవటం వలన ఆర్థిక సమస్యలు ఏర్పడటమే కాకుండా చెడుపేరు కూడా వచ్చే అవకాశముంటుంది. సంవత్సర ఆరంభంలో, చివరలో అవకాశాలు పెరిగినప్పటికీ ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లేకుండా పని చేయవలసి వస్తుంది. కేతు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉండటం వలన ఒక్కోసారి మీ వృత్తి కారణంగా ఆకస్మిక ధన లాభం గాని, గుర్తింపు కానీ లభిస్తుంది.
Sagittarius Horoscope
పరిహార క్రియలు
ఈ సంవత్సరం ధను రాశి వారు గురువు, శని మరియు రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దాని వలన ఈ గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా కూడా గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు గురు స్తోత్రం చదవడం కానీ, గురు పూజ చేయటం కానీ, లేదా గురు చరిత్ర పారాయణం చేయటం కానీ మంచిది. ఇవే కాకుండా 16,000 సార్లు గురు మంత్ర జపం చేయటం కానీ, గురు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. రెండవ ఇంటిలో శని చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు శని స్తోత్రం చదవడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయటం కానీ చేయాలి. ఇవి కాకుండా 19 వేల సార్లు శని మంత్రం జపం చేయడం కానీ లేదా శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. ఐదవ ఇంటిలో రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు రాహు స్తోత్రం పారాయణం చేయటం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. ఇవి కాకుండా 18,000 సార్లు రాహు మంత్రం జపం చేయటం కానీ, రాహు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.