Loan Without CIBIL: లోన్ తీసుకునే వారికి పండగే.. ఇకపై సిబిల్ స్కోర్ అవసరం లేదు.
లోన్ తీసుకోవాలంటే కచ్చితంగా సిబిల్ స్కోర్ ఉండాలని అందరికీ తెలిసిందే. దీంతో తొలిసారి రుణం పొందే వారికి ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్తగా లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్
రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి అని చాలామంది భావిస్తారు. కానీ ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. తొలిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో క్రెడిట్ హిస్టరీ లేకపోయినా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే సంఖ్య. ఇది వ్యక్తి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. సాధారణంగా బ్యాంకులు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ వంటి వాటికి అర్హత ఇవ్వాలా లేదా అన్నది ఈ స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తాయి. కానీ కొత్త రుణదారులకు ఈ స్కోర్ లేకపోయినా ఇప్పుడు అడ్డంకి ఉండదు.
RBI తాజా మార్గదర్శకాలు
RBI జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ (06-01-2025) ప్రకారం, బ్యాంకులు ఇకపై కేవలం క్రెడిట్ హిస్టరీ లేదని, లేదా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చెప్పి దరఖాస్తును తిరస్కరించకూడదు. అంటే మీరు తొలిసారి రుణం కోసం ప్రయత్నిస్తే, మీ అప్లికేషన్‌ను కూడా సమానంగా పరిగణించాలి.
బ్యాంకుల జాగ్రత్తలు
స్కోర్ తప్పనిసరి కాకపోయినా, బ్యాంకులు తమ వైపు నుంచి కొన్ని తనిఖీలు చేస్తాయి. ఉదాహరణకు గతంలో తీసుకున్న రుణాల చెల్లింపు చరిత్ర. ఏవైనా ఆలస్యమైన EMIలు ఉన్నాయా. రుణం రైట్-ఆఫ్, రీస్ట్రక్చరింగ్ వంటి వివరాలు. అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి ఇలాంటి రికార్డులు ఉండవు కాబట్టి, బ్యాంకులు సాధారణ పరిశీలన ఆధారంగా నిర్ణయం తీసుకుంటాయి.
ఎందుకు కీలకం?
ఈ కొత్త మార్గదర్శకం వల్ల యువత, స్టార్ట్‌అప్‌లు, చిన్న వ్యాపారులు, క్రెడిట్ హిస్టరీ లేని వారు పెద్దగా లాభపడతారు. ఇప్పటి వరకు స్కోర్ లేకపోవడంతో రుణం తిరస్కరణలు ఎదుర్కొన్నవారు ఇప్పుడు ధైర్యంగా అప్లై చేయవచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థలో మరింత మందికి అవకాశాలు కల్పించి, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంచే మార్గాన్ని సుగమం చేస్తుందని నిపుణులు అంటున్నారు.