Washing clothes: గురువారం రోజున బట్టలు ఉతకడం అశుభమా?
Washing clothes: గురువారం రోజున బట్టలు ఉతకకూడదని అంటారు. అలాగే చేయడం అశుభమని చెబుతారు. ఇలా ఎందుకు చెబుతారో తెలుసా? గురువారం ఎందుకు దుస్తులు ఉతకకూడదో తెలుసుకోండి.

గురువారం బట్టలు ఉతకకూడదా?
భారతీయ సంప్రదాయంలో ప్రతి పనికీ ఒక సమయం, ఒక రోజు ప్రత్యేకంగా ఉంటాయని భావిస్తారు. కొన్ని రోజులు శుభం అని, మరికొన్ని రోజులు అశుభం అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి విశ్వాసాల్లో ఒకటి గురువారం రోజున బట్టలు ఉతకకూడదనే నమ్మకం. ఇది ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో పాటించే ఆచారం. హిందూమతంలో గురువారం రోజు బ్రహస్పతికి అంకితం చేశారు. ఈ రోజు భక్తులు దేవాలయాలకు వెళ్లి పసుపు దుస్తులు ధరించి, పసుపు రంగు వంటకాలు తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున బట్టలు ఉతకడం లేదా తలస్నానం చేయడం వల్ల గురు గ్రహం అనుగ్రహం తగ్గుతుందనే నమ్మకం ఉంది.
ఎందుకు బట్టలు ఉతకకూడదు?
పురాతన కాలంలో మహిళలు గురువారం రోజున పూజలు చేసి కుటుంబానికి ఐశ్వర్యం కలగాలని కోరుకునేవారు. ఆ రోజున నీటి సంబంధ పనులు, ముఖ్యంగా బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం చేయడం శుభం కాదని పెద్దలు చెప్పారు. ఎందుకంటే గురువారంలో ఉన్న గురు అనే పదం గురుగ్రహానికి చెందినది. గురు గ్రహం ఆర్థిక స్థితి, జ్ఞానం, సంపదకు ప్రతీకగా పరిగణిస్తారు. నీటితో పనులు చేయడం వల్ల ఆ గ్రహం ప్రభావం తగ్గిపోతుందని, ధన నష్టం సంభవిస్తుందని వారు నమ్మేవారు. అందుకే చాలా ఇళ్లలో గురువారం రోజు బట్టలు ఉతకడం, తలకు స్నానం చేయడం వంటివి చేయకూడదని అంటారు.
ఏకాదశి రోజున కూడా..
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి పక్షంలో 11వ రోజును ఏకాదశి అంటారు. ఆ రోజు ఉపవాసానికి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున భగవాన్ విష్ణువును పూజించడం ప్రత్యేక ఫలితాలు ఇస్తుందని చెబుతారు. ఏకాదశి రోజున వ్రతం పాటిస్తూ శరీర శుద్ధి కంటే మనసు శుద్ధి ముఖ్యమనే నమ్మకం ఉంది. అందుకే ఈ రోజున కూడా బట్టలు ఉతకకూడదని కొందరు అనుసరిస్తారు. గతంలో నీరు తెచ్చుకోవడం, బట్టలు ఉతకడం కష్టమైన పనులు కావడంతో వారంలో ఒకరోజు విశ్రాంతి ఇవ్వడం కోసం కూడా ఈ నియమాలు పెట్టారని పండితులు చెబుతున్నారు. అంటే ఇది ఆధ్యాత్మికం మాత్రమే కాక శారీరకంగా విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.
అన్నిచోట్లా ఒకలా కాదు
ఇలాంటి విశ్వాసాలు ప్రాంతానికి తగ్గట్టు, ఇంటికి తగ్గట్టు, వ్యక్తుల నమ్మకాలకు తగ్గట్టు మారుతాయి. కొందరు శనివారం రోజున కూడా బట్టలు ఉతకరాదు అంటారు. ఎందుకంటే అది శని దేవుని రోజు. మరికొందరు ఈ విషయాలను కేవలం సంప్రదాయం భాగంగా మాత్రమే పాటిస్తారు, కానీ దానిని ఆధ్యాత్మికంగా చూడరు. ఇప్పుడు కాలం మారింది. ఆధునిక జీవనశైలిలో ఇలాంటి నియమాలు పాటించడం అందరికీ సాధ్యం కాదు. కానీ కుటుంబ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎవరికైనా ఈ ఆచారం కొనసాగించాలనిపిస్తే అది తప్పు కాదు. గురువారం లేదా ఏకాదశి రోజున బట్టలు ఉతకకూడదనే నమ్మకం కేవలం విశ్వాసాల్లో ఒకటి మాత్రమే.