మీ దగ్గర అరెకరం పొలం ఉన్నా చాలు..లక్షల ఆదాయం ఇలా పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి
Capsicum: అరెకరం పొలం ఉన్న చాలు లక్షల ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీకు కొంచెం కష్టపడాలి. క్యాప్సికం పంటను అందులో వేయాలి. దీంతో మీరు బాగా లాభాలు పొందవచ్చు.

అరెకరంతోనే భారీ లాభాలు
వ్యవసాయం చేయడం కష్టం అనుకుంటారు. కానీ తెలివిగా చేస్తే వ్యవసాయం బంగారంలాంటి లాభాలను అందిస్తుంది. ఇలాంటి లాభాలను తెస్తున్న పంటల్లో ఇప్పుడు క్యాప్సికం పంట ముఖ్యమైంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ పంట ప్రస్తుతం కాసులు కురిపిస్తోంది. కేవలం అర ఎకర భూమిలోనే లక్ష రూపాయలకు పైగా ఆదాయం తేవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికం అంటే మనం సాధారణంగా కూరల్లో వాడే షిమ్లా మిర్చి. ఇది ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో లభిస్తుంది. మార్కెట్‌లో ముఖ్యంగా రెడ్ క్యాప్సికానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హోటళ్లలో, పిజ్జా, బర్గర్, చైనీస్ వంటల్లో క్యాప్సికం విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో దీని ధర ఎప్పుడూ బాగానే ఉంటుంది.
ఎంత లాభం వస్తుంది?
క్యాప్సికం పంటను సీజన్‌కి తగిన సమయాల్లో సాగు చేస్తే మంచి ఫలితం వస్తుంది. వేసవి కాలం తప్పించి, సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగు చేయడం ఉత్తమం. వ్యవసాయ నిపుణులు చెబుతున్న ప్రకారం, అర ఎకర భూమిలో క్యాప్సికం పంట సాగు చేయడానికి సుమారు రూ. 15,000 నుండి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో విత్తనాలు, ఎరువులు, మల్చింగ్ షీట్లు, డ్రిప్ సిస్టమ్, కూలీల ఖర్చులు కలిపే ఉంటాయి. సరైన సంరక్షణ వల్ల పంట బాగుంటే, ఒక సీజన్‌లోనే లక్ష రూపాయల నుంచి రూ. 1.5 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇది సాధారణ పంటల కంటే మూడింతలు ఎక్కువ లాభం అని చెప్పొచ్చు.
డ్రిప్ ఇరిగేషన్ మంచిది
క్యాప్సికం పంటకు సారవంతమైన నీటితో తడిసిపోయిన భూమి అవసరం. భూమిని లోతుగా దున్ని, ఆర్గానిక్ ఎరువులు కలపాలి. ఆ తర్వాత మల్చింగ్ షీట్లను వేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే నీటి వృధా తగ్గుతుంది. మొక్కలను సుమారు 1.5 అడుగుల దూరంలో నాటాలి. విత్తిన 45 రోజులకు పువ్వులు వస్తాయి. రెండు నెలల్లో క్యాప్సికం కాయలు తయారవుతాయి. పంటను 3 నుండి 4 నెలల వరకూ పంటగా తీసుకోవచ్చు. క్యాప్సికం మొక్కలు వేడి, వడగాలి, అధిక వర్షాలను తట్టుకోలేవు. అందువల్ల ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం. కీటకాలు, తెగుళ్లు రాకుండా జాగ్రత్తగా స్ప్రేలు వేయాలి. గ్రీన్ హౌస్ పద్ధతిలో సాగు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వాతావరణాన్ని నియంత్రించుకోవడం సులభం అవుతుంది.
మార్కెట్లో డిమాండ్ ఉందా?
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో క్యాప్సికం డిమాండ్ బాగా ఉంది. ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎరుపు, పసుపు రంగుల క్యాప్సికానికి అధిక ధర లభిస్తోంది. రైతులు ఈ పంటను సమయానికి మార్కెట్లో విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక మంది రైతులు ఈ పంటను విజయవంతంగా సాగు చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రైతులు హైటెక్ సాగు పద్ధతులతో క్యాప్సికం పండించి ప్రతి సీజన్‌లో లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.