- Home
- Astrology
- Shakuni: కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైన శకుని ఎలా మరణించాడు? అతనికి గుడి ఎందుకు కట్టారు?
Shakuni: కురుక్షేత్ర యుద్ధానికి కారకుడైన శకుని ఎలా మరణించాడు? అతనికి గుడి ఎందుకు కట్టారు?
మహాభారత యుద్ధానికి కారణం శకుని (Shakuni). కౌరవుల వంశాన్ని నాశనం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన పాచికలతోనే కురుక్షేత్ర యుద్ధం వచ్చేలా చేశాడు. అలాంటి శకుని ఎలా మరణించాడు? అతనికి గుడి ఎందుకు కట్టారు?

శకుని ఎవరు?
తన అన్నదమ్ముల చావుకు కారణమైన కౌరవులపై ప్రతీకారం తీర్చుకోవాలని శకుని తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. శకుని ఎవరో కాదు మహాభారతంలో గాంధారి తమ్ముడు.. అంటే దుర్యోధనుడికి సొంత మేనమామ. అతడికి మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.
అన్న ఎముకలతోనే
శకునిని, అతని అన్నలను కౌరవులు చెరసాలలో బంధించి రోజుకు ఒక ముద్ద ఆహారం మాత్రమే ఇచ్చేవారు. అన్నలిద్దరూ శకునికి ఆహారాన్ని పెట్టి కౌరవులపై ప్రతీకారం తీర్చుకోమని కోరి తాము మాత్రం ప్రాణం విడిచారు. శకుని తన అన్నల ఎముకలతోనే పాచికలను తయారు చేశాడు. అందుకే ఆ పాచికలు శకుని ఎలా చెబితే అలా వింటాయి. చివరికి దుర్యోధనుడి పక్కన చేరి అతడికి దురాలోచనలను నేర్పాడు.
శకుని మరణం
కౌరవులు పాండవుల కురుక్షేత్ర యుద్ధానికి కారణం శకుని కుతంత్రాలే. పాండవుల చేతిలో కౌరవులను పూర్తిగా నాశనం చేయించాడు. అతడి ప్రతీకారం తీరిపోయింది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో శకుని కూడా పాల్గొన్నాడు. ఆ సంగ్రామంలోనే కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన శకునుని పాండవ సోదరులైన నకులుడు, సహదేవులు కలిపి చంపేశారు. అలా చనిపోయిన శకుని స్వర్గానికే చేరాడు. ఇన్ని పాపాలు చేసిన వ్యక్తి స్వర్గానికి ఎలా వెళ్లాడనే సందేహం రావచ్చు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో స్వయంగా ఆ విష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నాడు. అందుకే ఆ యుద్ధ భూమిలో చనిపోయిన వారంతా స్వర్గానికే చేరుకున్నారు.
శకుని ఆలయం
మహాభారత యుద్ధంలో మరణించిన శకునికి ఒక ఆలయం కూడా ఉంది. ఇది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో ఉంది. దీని పేరు పవిత్రేశ్వరం. దీన్నే శకుని ఆలయం అని కూడా పిలుచుకుంటారు. దీనికి దగ్గరలోనే దుర్యోధనుడి ఆలయం ఉంది. కేరళలోని గురువార్ తెగ వాళ్ళు శకునికి సాత్విక లక్షణాలు కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ గుడిని నిర్మించారు. దాని బాగోగులన్నీ కూడా ఆ తెగ వాళ్లే చూసుకుంటారు. ఈ ఆలయంలో సింహాసనంపై కూర్చున్న శకుని విగ్రహం ఉంటుంది.
కేరళతో అనుబంధం
శకునిని ఈ ఆలయంలో పూజించడం వంటివి చేయరు. మహాభారత యుద్ధం జరిగే సమయంలోనే శకుని వందమంది కౌరవులతో కలిసి దేశమంతా తిరిగాడని, అలా కేరళలోని ఈ ప్రాంతానికి కూడా వచ్చాడని చెప్పుకుంటారు. అలాగే ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలను కూడా ఉంచారని అంటారు. అందుకే ఈ ఆలయంలోని ఈ ప్రాంతంలోనే శకుని కి దుర్యోధనుడికి ఇతర కౌరవులకు కూడా ఆలయాలు ఉన్నాయని అంటారు. శకుని శివ భక్తుడు.