Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారి చేతిలో రూపాయి కూడా నిలవదు.. ఎందుకో తెలుసా?
కొంతమంది బాగా సంపాదిస్తారు. కానీ చేతిలో మాత్రం డబ్బు ఉండదు. వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటుంది. దీనికి కారణం అలవాట్లు మాత్రమే కాదు, జన్మ నక్షత్రం ప్రభావం కూడా అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఏ నక్షత్రాల వారి చేతిలో డబ్బు నిలవదో చూద్దాం.

Birth Stars Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జన్మ నక్షత్రం.. వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే శక్తిపై మాత్రమే కాదు, ధన ప్రవాహం, ఖర్చు చేసే అలవాట్లు, డబ్బును నిలుపుకునే సామర్థ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారి చేతిలో రూపాయి కూడా నిలవదు. ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది. దీనికి కారణం వారి మనస్తత్వం, దయాగుణం, ఆవేశం, భావోద్వేగ నిర్ణయాలు, అలాగే గ్రహస్థితుల ప్రభావం అని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో పుట్టినవారు చాలా వేగంగా ఆలోచించి వెంటనే నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా నచ్చితే ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవడం వీరి ప్రత్యేకత. ఈ లక్షణమే డబ్బు విషయంలో కూడా కనిపిస్తుంది. అవసరం అనిపిస్తే వెంటనే ఖర్చు చేయడం, ఎవరు సహాయం అడిగినా ఆలోచించకుండా డబ్బు ఇవ్వడం వీరి అలవాటు. సేవింగ్స్ గురించి ఆలోచన ఉన్నా, అది ఆచరణలోకి రావడం కష్టం. జ్యోతిష్య నిపుణుల ప్రకారం అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిలో డబ్బు ఆదా చేసుకునే వాళ్లకంటే, ఖర్చు చేసే వాళ్లే ఎక్కువ.
పునర్వసు నక్షత్రం
పునర్వసు నక్షత్రంలో పుట్టినవారికి మంచి మనసు, దయ, ఉదారత ఎక్కువగా ఉంటాయి. వీరు తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలను ముందుగా చూస్తారు. కుటుంబం, స్నేహితులు, బంధువులు ఇలా ఎవరు అడిగినా “లేదు” అనలేరు. ఈ స్వభావం వల్ల సంపాదించిన డబ్బు ఎక్కువగా ఇతరుల కోసమే ఖర్చు చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి డబ్బు కంటే ధర్మం, మానవత్వమే ముఖ్యం అనిపిస్తుంది. అందుకే వీరి చేతిలో డబ్బు ఎక్కువసేపు నిలవదు.
పూర్వఫల్గుణి నక్షత్రం
పూర్వఫల్గుణి నక్షత్రంలో పుట్టినవారు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. లగ్జరీ, వినోదం, ప్రేమ సంబంధాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. డబ్బు వస్తే, దాచుకోవాలి అన్న ఆలోచన కన్నా, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అన్న కోరికే వీరికి ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం వీరికి రేపు అనే ఆలోచన కన్నా ఈ రోజు సంతోషమే ముఖ్యం. ఈ కారణంగానే డబ్బు వచ్చింది వచ్చినట్లు ఖర్చైపోతుంది.
రేవతి నక్షత్రం
రేవతి నక్షత్రంలో పుట్టినవారు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారు. దానం, సహాయం, సేవా భావం వీరి సహజ లక్షణాలు. జ్యోతిష్య పండితుల ప్రకారం రేవతి నక్షత్ర జాతకులు డబ్బును తమ కోసం కంటే ఇతరుల మేలు కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ స్వభావమే వీరి చేతిలో డబ్బు నిలవకుండా చేస్తుంది. అయితే వీరికి అవసరమైన సమయంలో ఎవరో ఒకరు వీరికి డబ్బు సహాయం చేయడం విశేషం.
హస్త నక్షత్రం
హస్త నక్షత్రంలో పుట్టినవారికి సంపాదించే తెలివి, నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. చేతిలో పని ఉంటే డబ్బు అదే వస్తుంది అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి వెంటనే సహాయం చేయడం, చిన్నచిన్న విషయాలకే ఖర్చు పెట్టడం వీరి అలవాటు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరు భావోద్వేగాల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే సంపాదన ఉన్నా సేవింగ్స్ మాత్రం తక్కువగా ఉంటాయి.

