Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కుంభ రాశి జాతకం
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో కుంభ రాశి వారికి ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగి పోతుంది. దానివలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చ గలుగుతారు. గతంలో మీ సహోద్యోగులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.
Aquarius
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం, గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, ఆర్థికంగా, మరియు ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది.
Aquarius
కుంభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ వృత్తిలో పదోన్నతి రావటమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. తిరిగి మీ కుటుంబం తో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసిన కారణంగా గుర్తింపును, పై అధికారులు ప్రశంసలను పొందుతారు. మీరు పనిచేసే చోట ఆదర్శ వంతులుగా కొనియాడబడతాడు. రాహు గోచారం మూడవ ఇంటిలో ఉండటంతో మీలో ఉండే నిరాశా, నిస్పృహలు తొలగిపోయి, ఉత్సాహంగా మీ పని చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయం తొలగి పోతుంది. దానివలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చ గలుగుతారు. గతంలో మీ సహోద్యోగులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది. సంవత్సరం మధ్యలో శనిగోచారం తిరిగి 12వ ఇంటికి రావటం వలన చేసే పనిలో ఆసక్తి తగ్గడం కానీ, బద్ధకం పెరగడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీరు బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని వీడి పని చేయడం వలన గతంలో సంపాదించిన పేరు నిలబెట్టుకో గలుగుతారు. ఈ సమయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు దగ్గరగా వచ్చి మీ నిర్లక్ష్యం కారణంగా కానీ, బద్ధకం వలన కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు చెప్పే మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, లేదా విలువ ఇవ్వకపోవడం కానీ జరగవచ్చు. అలాగే పని విషయంలో తొందరపడి మాట ఇచ్చి తర్వాత బాధ పడటం జరగవచ్చు. గురు గోచారం ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ శ్రేయోభిలాషుల వలన కానీ, మీ పై అధికారుల వల్ల కానీ ఊహించని లాభాలు పొందుతారు.
Aquarius
ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం, కుంభ రాశిలో జన్మించిన వారికి, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా ప్రధాన గ్రహాల గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి లో అనుకూలమైన మార్పులు జరుగుతాయి. గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, రాహు గోచారం మూడవ ఇంట ఉండటం అలాగే శని దృష్టి సంవత్సర ఆరంభంలో మరియు చివరలో ధన స్థానము పై ఉండకపోవడంతో ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఖర్చులు తగ్గటమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు సమయానికి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా వారసత్వ వివాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం డబ్బు కానీ, స్థిరాస్తులు కానీ లభిస్తాయి, మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా కూడా ఆదాయం జరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో ఇల్లు కాని, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంవత్సరం మధ్యలో శని దృష్టి రెండవ ఇంటిపై పడటం వలన, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన పెరిగిన ఖర్చులను తట్టుకునే ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు. ఈ సమయంలో డబ్బు అప్పు ఇవ్వడం కాని, గొప్పలకు పోయి విలాసాల కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచిది కాదు. దానివలన ఇచ్చిన డబ్బు తిరిగి రాక పోగా ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.
Aquarius
కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు గోచారం బాగా ఉంటుంది కాబట్టి కుటుంబ పరంగా సమస్యలు లేకుండా ఉంటుంది. గురు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది. మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరగటం కానీ, సంతానం కలగని వారికి సంతానం అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండటం కానీ, లేదా వారితో మీకు మనస్పర్థలు రావడం కాని వచ్చు. సంవత్సరమంతా రాహువు మూడో ఇంటిలో ఉండటం వలన మీరు కొత్త ఇంటికి మారడం కానీ, కొత్త ప్రదేశంకు మారడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా గతంలో ఉన్న మానసిక సమస్యలు తగ్గుతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంవత్సరం మధ్యకాలంలో శనిగోచారం 12వ ఇంట ఉండటం వలన ఈ సమయంలో కోర్టు కేసులు కానీ, వారసత్వ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట కారణంగా మీ కుటుంబ సభ్యుల మనసు నొచ్చు కోవడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం కానీ జరగవచ్చు. మీ కుటుంబంలో పెద్దవారి జోక్యంతో ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి.
ఆరోగ్యం
ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ ఉద్యోగం కారణంగా లేదా మీ కుటుంబం కారణంగా ఏర్పడిన మీ మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎముకలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉండే అవకాశమున్నది. అయితే సంవత్సరమంతా గురువు, మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికి వాటిని తట్టుకోగలిగే మానసిక, శారీరక శక్తిని కలిగి ఉంటారు.
వ్యాపారం మరియు స్వయం ఉపాధి
కుంభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కలిసి రావడంతో వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఈ సంవత్సరం అంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపారపరంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. అయితే సంవత్సరం మధ్యలో శనిదృష్చి సప్తమ స్థానంపై ఉండటం వలన ఈ సమయంలో వ్యాపారంలో అనుకోని మార్పులు జరగడం కానీ భాగస్వాములు వెళ్లిపోవడం కానీ లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు రావడం కానీ జరుగుతుంది. దాని కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. అయితే రాహు మరియు గురు గోచారం అనుకూలంగా ఉండటంతో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్యపూర్వకంగా, మీకు అనుకూలంగా పరిష్కరించుకో గలుగుతారు. దానివలన వ్యాపారం లో నష్టాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకో గలుగుతారు. గతంలో మీతో పోటీపడ్డ వారు కానీ, మీతో శత్రుత్వం కలిగి ఉన్నవారు కానీ ఈ సమయంలో మీకు దూరంగా వెళ్లి పోతారు. వారి ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నవారికి, కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. అయితే సంవత్సరం మధ్యలో మీ వ్యక్తిగత సమస్యల కారణంగా కానీ, లేదా ఇతర సమస్యల వల్ల కానీ మీరు మీ పనిని సక్రమంగా నిర్వహించ లేక పోతారు. దాని కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సంవత్సరమంతా గురు గోచారం మరియు రాహు గోచారం బాగుండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ వాటిని మీకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధిస్తారు. మీరు చేపట్టే పనుల్లో విజయం సాధించడమే కాకుండా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. ప్రజల మెప్పును పొందుతారు. ఈ సమయంలో లో మీ పనిలో మీరు చూపించే నైపుణ్యం కారణంగా మరిన్ని అవకాశాలను పొందుతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్య శని గోచారం ఉండటం వలన మీరు చేపట్టిన పని కొంత ఆలస్యంగా పూర్తిచేస్తారు. దానివలన మీరు కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంది. అయితే మీ శ్రేయోభిలాషుల సహకారంతో ఈ సమస్య నుంచి బయట పడతారు.
పరిహారాలు
కుంభ రాశిలో జన్మించిన వారు, ఈ సంవత్సరం, శనికి పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయడం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ, శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. శని మనం నిజాయితీగా చేసే కష్టానికి సంతృప్తి చెందుతాడు కాబట్టి, శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం మొదలైన వాటి వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.