- Home
- Astrology
- Siddhidatri: అమ్మవారికి చెప్పులను నైవేద్యంగా సమర్పించే వింతైన ఆలయం.. ఈ గుడి ఎక్కడ ఉందంటే
Siddhidatri: అమ్మవారికి చెప్పులను నైవేద్యంగా సమర్పించే వింతైన ఆలయం.. ఈ గుడి ఎక్కడ ఉందంటే
నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పలు రూపాల్లో భక్తులు కొలుస్తూ ఉంటారు. అందులో ఒక రూపం సిద్ధిధాత్రి (Siddhidatri). సిద్ధిధాత్రికి అంకితమైన ఆలయంలో చెప్పులను నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఉంది. అది ఎక్కడ ఉందో తెలుసుకోండి.

సిద్ధిధాత్రి అమ్మవారి దేవాలయం
మనదేశంలో నవరాత్రి సంబరాలు మొదలైపోయాయి. దేవాలయాల్లోని అమ్మవారికి పూలు, కొబ్బరికాయలు, చీరలు, స్వీట్లు సమర్పించి తమ కోరికలు నెరవేర్చమని భక్తులు కోరుకుంటున్నారు. అయితే ఒక ప్రదేశంలో మాత్రం అమ్మవారికి పూలు, స్వీట్లు కాకుండా.. చెప్పులు, బూట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఉంది. ఈ ఆలయం సిద్ధిధాత్రి అమ్మవారికి చెందినది. భక్తుల కోరిన కోరికలు నెరవేరిస్తే ఆ అమ్మవారికి బూట్లను, చెప్పులను కొని భక్తులు భక్తిశ్రద్ధలతో అందిస్తారు.
కొత్త బూట్లు, చెప్పులు
భోపాల్ లోని కోలార్ ప్రాంతంలోని కొండలపై ఈ సిద్ధిధాత్రి ఆలయం ఉంది. నవరాత్రి సమయంలో భక్తులు అధికంగా ఈ ఆలయానికి వస్తారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. అలా కోరికలు నెరవేరితే ఆ దేవతకు పండ్లు లేదా పువ్వులు కాదు బూట్లు, చెప్పులను అందించాలి. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోంది. అమ్మవారి దగ్గర కొత్త చెప్పులు, బూట్లు అక్కడ అధికంగా కనిపిస్తాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు నవరాత్రి సమయంలో దర్శనం చేసేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలుచుంటారు.
కలలో చెప్పిన అమ్మవారు
అమ్మవారికి చెప్పులు అందించే సాంప్రదాయం ఏనాడో మొదలైంది. 30 ఏళ్ల క్రితం అనేకమంది భక్తులకు ఒకేలాంటి కల వచ్చింది. అందులో సిద్ధిధాత్రి అమ్మవారు కనిపించి ఊరిలో ఏ మహిళా కూడా చెప్పులు లేకుండా నడవకూడదు అని ఆదేశించినట్టు కల వచ్చింది. అప్పుడే ఈ ఆలయానికి పునాది వేశారు. అలాగే బూట్లను, చెప్పులను సమర్పించే సాంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ ఆలయాన్ని స్థాపించింది. ఓం ప్రకాష్ గుప్తా అని చెప్పుకుంటారు. 1994లో ఆయన ఈ ఆలయాన్ని ఆరంభించే ముందు శివపార్వతుల వివాహాన్ని నిర్వహించారు. 1995లో ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది.
300 మెట్లు ఎక్కి
సిద్దిధాత్రి మాతా తమ కోరికలు అన్నింటినీ తీరుస్తుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. కోరిక తీరినప్పుడు చెప్పులను సమర్పిస్తూ తమ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు. అప్పటినుంచి ఇది కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. అమ్మవారి చుట్టూ పాదరక్షలు కూడా గుట్టల గుట్టలుగా పేరుకుపోవడం మొదలైంది. మీరు ఈ గుడికి చేరుకోవాలంటే దాదాపు 300 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ సాధారణ రోజుల్లోనే ఇక్కడ రోజు 50 నుంచి 60 జతల బూట్లను అమ్మవారికి సమర్పిస్తారు. ఇక నవరాత్రి సమయంలో అయితే వేల సంఖ్యలో చెప్పులు అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు.
పోస్టులోనే చెప్పులు
నైవేద్యంగా తెచ్చిన పాదరక్షలను ఆలయ ప్రాంగణంలోనే కొన్ని ప్రత్యేక పెట్టెల్లో ఉంచాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ బూట్లు, చెప్పులను పేద బాలికలకు పంపిణీ చేస్తారు. అలాగే చెప్పులు లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ వాటిని అందిస్తారు. ఈ సంప్రదాయం భోపాల్ వరకే ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇక్కడికి చెప్పులు, బూట్లను పట్టుకొని వస్తారు. విదేశాల నుండి కూడా భక్తులు పోస్టు ద్వారా చెప్పులను పంపిస్తారు. ఆ చెప్పులు పేద బాలికలకు చివరికి చేరుతాయి. కాబట్టి దాని వెనక ఒక సామాజికమైన ఉత్తమ కారణం ఉందని భక్తులు భావిస్తారు. అందుకే సిద్ధధాత్రి అమ్మవారికి ఇక్కడ ఎంతో ప్రాచుర్యం ఏర్పడింది. భూపాల్ వెళ్లినవారు కచ్చితంగా వారిని ఒకసారి దర్శించుకుని వచ్చేందుకు ప్రయత్నించండి.