YS Jagan: వైఎస్ జగన్ కోసం కొత్త రాజకీయ వ్యూహకర్త? ఈసారి ప్లాన్ ఏంటంటే..
YS Jagan: 2019-24 మధ్య జరిగిన రాజకీయ తప్పులు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు.. అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రాజకీయ వ్యుహకర్తతో ప్రణాళికలు సిద్దం చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారట. ఇందులో భాగంగా ఓ సీక్రెట్ ఒప్పందం జరిగిందని సమాచారం..

పంథా మార్చిన జగన్.?
రాజకీయ చదరంగంలో ఎందరో ఉద్దండులు ఉన్నారు. నిత్యం తమ వ్యూహాలకు, ఆలోచనలకు పదునుపెడుతూ ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. తలపండిన రాజకీయ నాయకులకు ఇది తెలిసిన విషయమే. ఎప్పుడూ తమ వ్యుహలకు పదునుపెడితేనే.. మనం అధికారంలో ఉండగలం. అపర చాణక్యుడు అయిన చంద్రబాబు.. ఎప్పటికప్పుడు తన వ్యుహలకు, ప్రణాళికలకు పదునుపెడుతూ.. ఇతరుల అభిప్రాయాలను కూడా సేకరిస్తూ ఉంటారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా ఇప్పుడు ఇదే పంథా ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది.
బెంగళూరు వేదికగా..
ఎన్నికలు గెలిచామంటే తప్పులు ఆటోమేటిక్‌గా కనిపించవు. కానీ ఓడిపోతేనే సవాలక్షా ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఎక్కడ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.? పార్టీ అంతర్గతంగా తలెత్తిన లోపాలు ఏంటి.? పాలనలో తలెత్తిన పొరపాట్లు..? ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రశ్నలు.. పైగా అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీని కూడా ఒకవైపు నుంచి సరిగ్గా కో-ఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ విషయాల్లోనే వైసీపీ కాస్త తడబడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ఈ పార్టీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో మళ్లీ పార్టీని ఎలా గాడిలో పెట్టాలనే ప్రణాళికలు బెంగళూరు వేదికగా సిద్దం చేస్తున్నారు వైఎస్ జగన్.
అటు తీపి.. ఇటు చేదు..
ఐప్యాక్ సంస్థ.. అటు చేదు, ఇటు తీపిని వైసీపీకి అందించింది. ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని ఐప్యాక్ స్ట్రాటజీలను 2019లో వైసీపీ ఫాలో అయ్యి 151 సీట్లతో బంపర్ మెజార్టీ అందుకుంది. రాష్ట్రమంతా తిరుగులేని విజయకేతనం ఎగురవేసి అధికారం చేపట్టింది. ఆ తర్వాత వైసీపీతోనే ఐప్యాక్ కలిసి పని చేసింది. ఇక 2024లో రుషి రాజ్‌సింగ్‌తో కలిసి వ్యూహాలు రచించిన వైసీపీ.. 'వైనాట్ 175' అనే స్లోగన్‌తో ప్రజల్లోకి వచ్చింది. కట్ చేస్తే.. జరిగిన సీన్ అందరికీ తెలిసిందే. అటు స్లోగన్ ఫ్లాప్.. ఇటు పార్టీ అట్టర్ ప్లాప్. అటు వాలంటీర్ల ఇష్యూ వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇలా వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు అన్ని విధాలుగా అలోచించి.. కొత్త వ్యూహకర్తను రంగంలోకి దింపాలని చూస్తున్నారట వైఎస్ జగన్.
మళ్లీ కొత్తగా.. సరికొత్తగా..
ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్‌తో ఐప్యాక్‌లో పని చేసిన సీనియర్ రాజకీయ వ్యూహకర్తతో వైఎస్ జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఆయన వ్యూహాలతో బరిలోకి దిగాలని చూస్తున్నారట. ప్రస్తుతం 2026 ప్రధమార్ధంలో వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సిన ప్రణాళికలను ఆయన సిద్దం చేస్తున్నారట. అటు పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. 2019-24 మధ్య జరిగిన రాజకీయ తప్పులను మళ్లీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు.
ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడమే లక్ష్యంగా..
అలాగే తిరిగి అధికారంలోకి వస్తే.. పార్టీ కార్యకర్తలకు పాలనలోని అన్ని అంశాలలో అగ్ర ప్రాధాన్యత ఇస్తామని జగన్ తన కార్యకర్తలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా.. ముఖ్యంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) నమూనా కింద కొత్త వైద్య కళాశాలలను స్థాపించాలనే చర్యకు వ్యతిరేకంగా కొత్త వ్యుహకర్త పలు ప్రణాళికలు రచించారట. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ కొత్త వ్యూహకర్తపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.