తిరుపతిలో బీజేపీకి చావో రేవో: దుబ్బాక తరహలో ఫలితం సాధిస్తోందా?
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ుంది. దీంతో ప్రచారంలో మరింత వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి నెలకొంది. తెలంగాణలో బీజేపీ ఇటీవల మెరుగైన ఫలితాలతో అధికార పార్టీకి సవాల్ విసిరింది. తిరుపతిలో విజయం సాధించడం ద్వారా ప్రత్యర్ధులకు సవాల్ విసిరాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
గత ఏడాది అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించారు.దీంతో ఈ నెల 17వ తేదీన తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
ఈ స్థానం నుండి పోటీ చేస్తామని జనసేన చివరి నిమిషం వరకు ప్రయత్నించింది. గత ఎన్నికల్లో తమ పార్టీ బలపర్చిన బీఎస్పీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ల కంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని జనసేన నేతలు చర్చల సందర్భంగా గుర్తు చేశారు
అయితే ఈ స్థానంలో చివరికి బీజేపీ పోటీకి దిగింది.ఈ స్థానం నుండి విజయం సాధించేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన సీట్లను సాధించింది
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరు కారణంగా హైద్రాబాద్ స్థానంలో ఓటమి పాలు కావాల్సి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో ఇటీవల వచ్చిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. ప్రస్తుతం జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడ ఫలితాలను సాధిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గతంలో ప్రకటించారు. ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేన అధిక స్థానాలను దక్కించుకొంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 12వ తేదీన ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు సర్శశక్తులను ఒడ్డుతున్నారు.
బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ దేవధర్ ఈ నియోజకవర్గంలో మకాం వేశారు. తమ మిత్రపక్షం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బెనిఫిట్ షో రద్దు విషయమై కూడ బీజేపీ ప్రచారఅస్త్రంగా వాడుకొంది. టీడీపీ కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.
తిరుపతి వెంకన్నను కేంద్రంగా బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. కేంద్రం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రం అభివృద్ది చేస్తోందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా బీజేపీ పదే పదే ప్రస్తావిస్తోంది.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోము వీర్రాజు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితం దక్కనుందా లేదా తేలనుంది.
దుబ్బాక తరహాలో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అనుహ్య విజయం సాధిస్తోందా... లేదా అనేది మే 2న ఫలితాలు తేల్చనున్నాయి.