Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో మాత్రం నవంబర్ 19 వరకు పొడి వాతావరణంతో పాటు చలి పెరగనుందనీ, అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం.. ఏపీకి వాన గండం, తెలంగాణకు చలి దెబ్బ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ (IMD) మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నవంబర్ 13న (శుక్రవారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి.
ఈ సిస్టమ్ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 14 నాటికి మరింత బలపడిన అల్పపీడనంగా మారనుంది. ఆ తర్వాత నవంబర్ 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తుపాను రానుందా?
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. వాయుగుండం ఏర్పడటం, అది తుపానుగా మారడం అనేవి రెండు వేర్వేరు దశలు. ప్రస్తుత నమూనాల ప్రకారం ఇది వాయుగుండంగా బలపడి ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. కానీ, ఇది కచ్చితంగా తుపానుగా మారుతుందా లేదా, ఏ తీరాన్ని దాటుతుంది, దీని తీవ్రత ఎంత ఉంటుంది అనే విషయాలపై ఇప్పుడే పూర్తి స్పష్టత లేదు. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని కేవలం అల్పపీడన వ్యవస్థగానే పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఏయే జిల్లాల్లో వర్షాలు పడతాయంటే?
ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం, నవంబర్ 13న రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ, 14, 15 తేదీల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. అలాగే విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, యానాం ప్రాంతాలతో వర్షాలు పడనున్నాయి.
రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి. నవంబర్ 16, 17, 18 తేదీల్లో మళ్లీ పొడి వాతావరణం ఉండి, 19న అక్కడక్కడా వర్షాలు కురవొచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలేవీ నవంబర్ 19 వరకు జారీ కాలేదు.
తెలంగాణకు పెరిగిన చలి
బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తెలంగాణ పై ఎక్కువ ప్రభావం వుండే అవకాశం లేదని వాతావరణ రిపోర్టులు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 13 నుంచి నవంబర్ 19 ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణమే కొనసాగనుంది.
ఈ ఏడు రోజుల పాటు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచనలు గానీ, హెచ్చరికలు గానీ లేవు. హైదరాబాద్ నగరంలో పగటిపూట ఎండ, అప్పుడప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం కనిపించనుంది.
వర్షాలు.. చలి పంజా: ప్రజలు, రైతులకు ముఖ్య సూచనలు
తెలంగాణలో వర్షాలు లేకపోయినా చలి తీవ్రత మాత్రం పెరగనుంది. రెండు రోజుల్లో (నవంబర్ 13, 14 తేదీల్లో) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉదయం వేళల్లో స్వల్ప పొగమంచు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు రాత్రి, తెల్లవారుజామున చలి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు ఏపీకి ప్రత్యేకంగా చలి హెచ్చరికలు లేనప్పటికీ, వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని, రైతులు వాతావరణ సూచనలకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేసుకోవాలని ఐఎండీ సూచించింది.













