Weather Update: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఎండాకాలంలో వానలు దంచికొడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది.

AP Weather Update: ఒకవైపు ఎండలు మరోవైపు వర్షాలు.. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పుడు ఇదే విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి.
ఈ క్రమంలోనే మరోసారి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.
కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఎండలు సైతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉరుములు మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు, అలాగే, పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇదే సమయంలో పలు జిల్లాల్లో వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మండే ఎండలతో పాటు వడగాలులు వీస్తూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయని విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, గుర్ల మండలాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య నమోదవుతుండగా, కొన్ని చోట్ల 41°C దాటిందని సమాచారం. వేంపల్లి (కడప) 41.4°C, గుర్ల (విజయనగరం) 41.2°C లతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అకాల వర్షాలు, వడగాలులు, వడగళ్ల వానల కారణంగా పంటలు దెబ్బతినే అవకాశముందనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. పిడుగులు పడే అవకాశముంది కాబట్టి వర్షాలు పడే సూచనలు కనిపిస్తే చెట్ల కింద ఉండొద్దని తెలిపారు.