weather: అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్
weather: సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ మే 27న అంటే సాధారణం కంటే ముందుగానే కేరళను తాకనుంది. ఈ వారంలో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వడగండ్లతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

weather update: ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా కంటే ముందుగానే మే 27న కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులకు ఎంతో అవసరమైన వర్షాలు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంటూ, వచ్చే నాలుగైదు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ-మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ప్రభావం విస్తరించనుందని అంచనా వేసింది.
వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్యలో పశ్చిమ బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు, ఉక్కపోత తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాణిలో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకోలు (43.5℃), జువ్విగుంట (43.3℃), మొగలూరు (43.1℃) సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల్లోని 116 కేంద్రాల్లో 41℃కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విపత్తు నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42℃ నుండి 43.5℃ మధ్య నమోదయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం, బుధవారం వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలను కూడా ప్రస్తావించింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో మరింత వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
ఇక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర, దక్షిణ ద్రోణులు బలహీనపడినప్పటికీ వచ్చే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. అయితే ఉష్ణోగ్రతలు 36℃ నుండి 40℃ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం సమయాల్లో చిరుజల్లులు పడే అవకాశముంది.
ఇప్పటివరకు వాతావరణ శాఖ స్పష్టమైన వర్షాభావ అంచనా ఇవ్వనప్పటికీ, మాన్సూన్ ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.