బంగాళాఖాతంలో అల్పపీడనం ... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
IMD Rain Alert : ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం… రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం… తర్వాత 48 గంటల్లో వాయుగుండం… ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ జోరువానలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని... ఈ వారమంతా ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నేడు ఏపీలో వర్షాలు
ఇవాళ సోమవారం (అక్టోబర్ 20) ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు... మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
బంగాళాఖాతంలో వాయుగుండం
ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని... తర్వాత 48 గంటల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ (సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
నిన్న ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 24 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి 13మిమీ, మధిరలో 11 మిమీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే మెదక్ లో అత్యల్పంగా 18.2 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. ఆదిలాబాద్ లో 19.7, హయత్ నగర్ 19, పటాన్ చెరు 19.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.