- Home
- Andhra Pradesh
- Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే
Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే
Weather Alert: ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే కొన్ని చోట్ల ఇంకా చలి తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెదర్ అప్డేట్‌పై ఓ లుక్కేద్దాం.

తగ్గుతోన్న చలి
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకా చల్లని వాతావరణంతో పాటు దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను వెల్లడించింది.
అల్పపీడన ద్రోణి ప్రభావం..
ఉత్తర కేరళ నుంచి అరేబియా సముద్రం వైపు అల్పపీడన ద్రోణి కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వాతావరణ పరిస్థితులు
మంగళవారం, బుధవారం రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు యానాం ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. అయితే ఉదయం వేళల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. పగటి సమయంలో ఆకాశం సాధారణంగా నిర్మలంగా ఉండే అవకాశముంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎలా ఉండబోతోంది?
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం, బుధవారం రోజులలో వర్ష సూచనలు లేవు. వాతావరణం పొడిగా ఉండే అవకాశమే ఎక్కువ. రాయలసీమ ప్రాంతంలో మంగళవారం నుంచి పొడి వాతావరణం కొనసాగనుంది. వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణ వాతావరణ సూచనలు, ఉష్ణోగ్రతల పరిస్థితి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం, బుధవారం రోజుల్లో వర్ష సూచనలు లేవు. వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో చలితో పాటు పొగమంచు కనిపించే అవకాశం ఉంది. రాగల కొన్ని రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండబోవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

