- Home
- Andhra Pradesh
- Tirumala: భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Tirumala: భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే
Tirumala: శ్రీవారి దర్శనంతో పాటు, జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తేదీలు, సమయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

తిరుమల భక్తులకు అదిరిపోయే న్యూస్.. శ్రీవారి దర్శనం, సేవలు, రూమ్ల బుకింగ్ డేట్స్ ఇవే!
ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం ఇచ్చింది. జనవరి నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను అక్టోబర్ నెలలో దశలవారీగా ఆన్లైన్లో రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
తిరుమలకు ప్రయాణం ప్లాన్ చేసుకునే భక్తులు ఎప్పటికప్పుడు ఈ తేదీలను, సమయాలను చెక్ చేసుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఆన్లైన్ కోటా విడుదలయ్యే సమయానికి విపరీతమైన రష్ ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు తమ వివరాలను ముందే రెడీగా ఉంచుకోవడం మేలని సూచించింది.
లక్కీ డిప్ సేవలు.. ఇతర ఆర్జిత సేవల సమయాలు
ముందుగా లక్కీ డిప్ ద్వారా కేటాయించే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. ఈ సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. డిప్లో ఎంపికైన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుసుము చెల్లిస్తేనే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.
అలాగే, అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తేనున్నారు.
అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్, ఉచిత ప్రత్యేక దర్శనాలు
మరోవైపు అక్టోబర్ 23వ తేదీన విడతల వారీగా కీలక కోటాలను విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.
ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి సౌకర్యార్థం కేటాయించే ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రీలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
రూ.300 దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ వివరాలు
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో ఉన్న అద్దె గదుల బుకింగ్ కోటాను కూడా అందుబాటులోకి తేనున్నారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే సేవలు, దర్శనం, వసతి గదులను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అలరించిన శ్రీ మలయప్పస్వామి గజవాహన సేవ
ఇదిలా ఉండగా, తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై కొలువుదీరి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత వేడుకగా సాగింది.
రాజ వైభవానికి ప్రతీకగా నిలిచే గజవాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ గజవాహనసేవలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామిలతో పాటు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

