- Home
- Andhra Pradesh
- Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
Tirumala Tirupati Devasthanams : తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో రూ.55 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో టీటీడీ బోర్డు ఏసీబీ దర్యాప్తును కోరింది.

టీటీడీలో భారీ అవినీతి.. సిల్క్ దుపట్టాల పేరుతో కోట్ల రూపాయల మోసం
Tirumala Tirupati Devasthanams : పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో భారీ కొనుగోలు కుంభకోణం వెలుగుచూసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు, విరాళాలు ఇచ్చే దాతలు, వేద ఆశీర్వచనం పొందే వారికి సాంప్రదాయబద్ధంగా అందజేసే పట్టు సారిగ దుపట్టాల (అంగవస్త్రాల) కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. గత పదేళ్లుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి టీటీడీ ఖజానాకు గండి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి తీవ్రంగా స్పందించింది. విజిలెన్స్ విచారణలో టెండర్ నిబంధనల ఉల్లంఘన, నకిలీ పట్టు సరఫరా జరిగిందని నిర్ధారణ అయింది. దీంతో టీటీడీ తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను సంప్రదించిందని దక్కన్ క్రానికల్ పేర్కొంది. సంబంధిత వివరాల ప్రకారం..
దశాబ్ద కాలంగా రూ.55 కోట్ల అక్రమాలు
టీటీడీకి గత పదేళ్లుగా ఒకే సంస్థ, దాని అనుబంధ సంస్థలు ఈ వస్త్రాలను సరఫరా చేస్తున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2015 నుండి 2025 మధ్య కాలంలో సదరు సంస్థ ఏకంగా రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలను టీటీడీకి విక్రయించింది.
అయితే, నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాణ్యత ఈ వస్త్రాల్లో లేదని, స్వచ్ఛమైన పట్టుకు బదులు తక్కువ ధరకు లభించే పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసి టీటీడీని మోసగించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ అక్రమం ద్వారా దేవస్థానానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
టీటీడీ: కుంభకోణం వెలుగులోకి ఎలా వచ్చింది?
ఇటీవల 21,600 పట్టు దుపట్టాల కొనుగోలు కోసం వచ్చిన ప్రతిపాదనను పర్చేజ్ కమిటీ పరిశీలించింది. ఈ ఫైలు ధర్మకర్తల మండలి వద్దకు చేరినప్పుడు, బోర్డు సభ్యులకు అనుమానం కలిగింది.
ప్రస్తుతం ఉన్న ఒప్పందాల ప్రకారం సరఫరా అవుతున్న దుపట్టాలు టీటీడీ నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ)ను బోర్డు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
టీటీడీ కఠినమైన నిబంధనలు.. ఉల్లంఘనలు
టీటీడీ నిబంధనల ప్రకారం, దాతలకు ఇచ్చే ఈ వస్త్రాలు పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నేయబడి ఉండాలి. అంతేకాకుండా, సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (SMOI) ధృవీకరించిన 'సిల్క్ మార్క్' లేబుల్ తప్పనిసరిగా ఉండాలి.
- వస్త్రంలో ఉపయోగించే వార్ప్, వెఫ్ట్ రెండూ 20/22 డెనియర్ ఫిలేచర్ సిల్క్‌ను కలిగి ఉండాలి.
- బంగారం, వెండి లేని 'టెస్టెడ్ జరీ'ని మాత్రమే వాడాలి.
- ప్రతి అంగుళానికి 100 ఎండ్స్, 80 పిక్స్ ఉండాలి.
- వస్త్రం వెడల్పు 1 మీటర్, పొడవు 2.3 మీటర్లు ఉండాలి.
- మధ్యలో "ఓం నమో వేంకటేశాయ" అని తెలుగు, సంస్కృతంలో ముద్రించి ఉండాలి, అలాగే శంఖు, చక్రం, నామం చిహ్నాలు ఉండాలి.
- మొత్తం బరువు 180 గ్రాములు ఉండగా, అందులో కనీసం 110 గ్రాములు శుద్ధి చేసిన పట్టు ఉండాలి.
కానీ, సరఫరాదారులు ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కినట్లు గుర్తించారు.
ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు
విజిలెన్స్ అధికారులు తిరుపతి గోడౌన్, తిరుమల వైభవోత్సవ మండపంలోని తాజా స్టాక్ నుండి శాంపిల్స్ సేకరించారు. ఈ వస్త్రాలన్నింటినీ నగరికి చెందిన మెస్సర్స్ విఆర్ఎస్ ఎక్స్ పోర్ట్ (M/s VRS Export) అనే సంస్థ సరఫరా చేసింది.
సేకరించిన నమూనాలను బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (CSB) ప్రయోగశాలలకు పంపారు. ల్యాబ్ రిపోర్టులు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. ఆ వస్త్రాలు సిల్క్ కాదనీ, పాలిస్టర్ అని నిర్ధారించారు. అంతేకాకుండా, ఏ ఒక్క వస్త్రం పైనా తప్పనిసరిగా ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఒక దుపట్టా ధర సుమారు రూ.1,389గా కాంట్రాక్ట్ కుదుర్చుకుని, చౌకరకమైన పాలిస్టర్ మెటీరియల్ అంటగట్టారని తేలింది.
శాంపిల్స్ మార్పిడి అనుమానాలు - కఠిన చర్యలు
గతంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (వేర్‌హౌస్) పంపిన నమూనాలను కాంచీపురంలోని సిల్క్ బోర్డ్ ల్యాబ్ ఆమోదించినట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఇప్పుడు అదే స్టాక్ నుండి తీసిన నమూనాలు బెంగళూరు, ధర్మవరం ల్యాబ్‌లలో ఫెయిల్ అయ్యాయి.
దీన్ని బట్టి, ల్యాబ్‌కు పంపే సమయంలో అసలైన శాంపిల్స్‌ను మార్చడం లేదా ల్యాబ్ స్థాయిలో ఏమైనా అవకతవకలు జరిగి ఉండవచ్చని విజిలెన్స్ రిపోర్టు అనుమానం వ్యక్తం చేసింది. టెండర్ దారుడు టీటీడీని మోసం చేశారని నిర్ధారించిన సీవీఎస్ఓ, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
దీంతో టీటీడీ బోర్డు తక్షణమే స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న టెండర్లను రద్దు చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. అలాగే, పారదర్శకత కోసం తాజా టెండర్లను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించింది.

