Weather Update : బంగాళాఖాతంలో బలపడిన ద్రోణి.. దసరా పండగపూట ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగపూట కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు ప్రకటించాయి.. నేడు ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట తెెలుసా?

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ (IMD). ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉండగా, తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందట. ఈ నెల (అక్టోబర్ 22) వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ద్రోణి ప్రభావంతో నేడు విజయదశమి (మంగళవారం, అక్టోబర్ 20) పండగపూట కూడా ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేస్తోంది. ఇలా కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చని తెలిపింది..
పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని APSDMA హెచ్చరిస్తోంది. ఉరుములు ప్రారంభమైనప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు... చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందడం ప్రమాదకరం… జాగ్రత్తగా ఉండాలని ప్రజలను సూచిస్తోంది.
తెలంగాణలో 8 జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్
తెలంగాణలోనూ ఇవాళ (మంగళవారం) కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు పడవచ్చని అంచనా.
ఈ ప్రాంతాల్లోని అన్ని చోట్ల వర్షాలు కురవకపోవచ్చు. ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉండగా, మిగతా చోట్ల పొడి వాతావరణం కొనసాగవచ్చట. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రధానంగా పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయంటోంది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు సూచిస్తున్నాయి. సంబంధిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలి.
పగటిపూట వేడి.. రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులు
తెలంగాణలో వర్ష సూచనలు ఉన్నప్పటికీ పగటిపూట ఎండ, వేడి సాధారణంగానే కొనసాగవచ్చని అంచనా. అయితే మంగళవారం నుంచి రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉదయం, రాత్రి వేళల్లో స్వల్పంగా చల్లదనం పెరగవచ్చు. వర్షాలు కురిసే ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, ఈదురుగాలుల కారణంగా స్థానికంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపించవచ్చు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన వాతావరణం ఉండకపోవచ్చని గుర్తించాలి.
చెన్నైలో రికార్డు స్థాయి వర్షాలు
మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర చెన్నైలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.నగరంలోని పారీస్ ప్రాంతంలో 24 గంటల్లో సుమారు 36.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాతివాక్కం ప్రాంతంలోనూ అత్యంత భారీ వర్షం కురిసింది.
తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 21 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా, ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల వర్షాలు కొనసాగవచ్చు. అక్టోబర్ 22 వరకు చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళనాడులోనూ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదు.
- ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన భవనంలోకి వెళ్లాలి.
- భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో నీరు నిలిచిన రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
- రైతులు, వ్యవసాయ కూలీలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలి.
మొత్తంగా చూస్తే.. మంగళవారం ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనలు ఉండగా, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నైలో మాత్రం భారీ వర్షాలు ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున APSDMA, IMD జారీ చేసే తాజా హెచ్చరికలను గమనించడం మంచిది.

