విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందట.
విజయవాడ: ఆగష్టు నెల అంటే తెలుగుదేశం పార్టీకి సంక్షోభంగా అంటూ ఉంటారు. నిజంగానే ఆగష్టు మాసంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత, రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇక టీడీపీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈనెల 5న విజయవాడ రాబోతున్నారని వచ్చిన వెంటనే వైసీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇంతకీ ఆ నేత ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. గత కొంతకాలంగా బొండా ఉమా మహేశ్వరరావు వైసీపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు. గతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను తప్పించే ఆలోచన పార్టీ చేయని పరిస్థితి. ఇకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి లేరని పార్టీలో ప్రచారం జరుగుతుంది.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందట.
అయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యతలు తీసుకునేందుకు బొండా ఉమామహేశ్వరరావు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ సహరించే అవకాశం లేదని బొండా ఉమామహేశ్వరరావు భావిస్తున్నారట.
ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఇద్దరు ఇంచార్జ్ లు మారారు. ఎన్నికల ముందు వరకు యలమంచిలి రవి పార్టీ సీనియర్ నేత ఇంచార్జ్ గా వ్యవహరిస్తే ఎన్నికలు సమీపించే సరికి ఆయన్ను తప్పించి బొప్పన భవకుమార్ ను తెరపైకి తెచ్చింది.
2019 ఎన్నికల్లో బొప్పన భవకుమార్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మెహన్ రావు చేతిలో పరాజయం పాలయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తున్న వైసీపీ బొండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరితే ఆయనను అక్కడ నుంచే రంగంలోకి దింపాలని భావిస్తోందట.
ప్రస్తుతం బొండా ఉమామహేశ్వరరావు ఆస్ట్రేలియాలో ఉన్నారని తెలుస్తోంది. ఈనెల 5న విజయవాడ రాబోతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వచ్చిన అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇకపోతే బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. మంత్రి పదవి దక్కకపోవడంతో అలకబూనారు. ఆ సమయంలో జనసేన పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత మాజీఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపోతే ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు బొండా ఉమామహేశ్వరరావు. కాకినాడలో కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం అనంతరం విజయవాడలో బొండా ఉమా మహేశ్వరరావు నివాసంలో మరోసారి భేటీ అయ్యారు.
ఇకపోతే ప్రజావేదిక కూల్చివేత, పార్టీ భవిష్యత్ కార్యచరణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశానికి బొండా ఉమామహేశ్వరరావు గైర్హాజరయ్యారు. విజయవాడలోనే ఉంటూ సమావేశానికి రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది.
బొండా ఉమామహేశ్వరరావు ఇంతకీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటారా లేక వైసీపీలో చేరతారా అనేది తెలియాల్సి ఉంది. బొండా ఉమా పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను ఆయన అనుచరులు ఇప్పటి వరకు ఖండిచకపోవడంతో తెలుగుదేశం పార్టీలో గుబులు మెుదలైంది.
Today's Poll
Please select an option to vote
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?