టీచర్లు, పోలీసులతో లిక్కర్ షాపుల నిర్వహణా: జగన్‌పై చంద్రబాబు ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు పున: ప్రారంభించడంతో మందుబాబులు క్యూకట్టారు. జగన్ ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచిందని, మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం కనిపించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మద్యం కారణంగా హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ప్రారంభించారని ఆయన విమర్శించారు.
మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా..? చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను లిక్కర్ షాపుల వద్ద పెడతారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రెడ్ జోన్లలో కనీసం మాస్కులు కూడా ఇవ్వలేకపోయారంటూ ప్రతిపక్షనేత ధ్వజమెత్తారు.
130 కోట్ల మంది ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించారని టీడీపీ అధినేత ప్రశంసించారు. ఏపీలో రెడ్‌జోన్‌లో 5, ఆరెంజ్ జోన్‌లో 7, గ్రీన్ జోన్‌లో ఒక జిల్లా ఉందన్నారు.
దేశంలో నిన్న ఒక్కరోజే 3,932 కరోనా కేసులు నమోదయ్యాయని.. క్రమశిక్షణగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్ధితి మన చేతుల్లో ఉండదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాలు తెరవొద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళనలు చేశారని టీడీపీ అధినేత అన్నారు. మద్యం వల్ల ఇప్పటికే కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.