- Home
- Andhra Pradesh
- రోహిత్ తర్వాత టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ఎవరు? శ్రేయాస్ అయ్యర్ పోటీలో ఉన్నారా?
రోహిత్ తర్వాత టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ఎవరు? శ్రేయాస్ అయ్యర్ పోటీలో ఉన్నారా?
Team India : ప్రస్తుతం భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టెస్టు క్రికెట్ లో శుభ్ మన్ గిల్, వన్డే జట్టుకు రోహిత్ శర్మ, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ అవుతారా?

రోహిత్ తర్వాత భారత జట్టు కెప్టెన్ ఎవరు?
భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో వన్డే జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అవుతారనే వార్తలు వచ్చాయి. కానీ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ ఊహాగానాలను ఖండించారు. రోహిత్ తర్వాత టీమిండియా వన్డే జట్టు నాయకత్వం శుభ్‌మన్ గిల్ చేతుల్లోకి వెళ్తుందని ఆయన తెలిపారు. దీనికి ప్రత్యేకంగా అధికారిక ప్రకటన అవసరం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
KNOW
అయ్యర్ కాదు, గిల్ మాత్రమే ముందున్నాడు: ఆకాశ్ చోప్రా
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అవుతారన్నది పూర్తిగా ఊహాగానం మాత్రమేనని ఆకాశ్ చోప్రా అన్నారు. శుభ్‌మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్, అలాగే వన్డే, టీ20 ఫార్మాట్‌లలో వైస్ కెప్టెన్ గా ఉన్న సంగతిని గుర్తు చేశారు. రోహిత్ శర్మ తర్వాత సహజంగానే గిల్ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అలాగే, అక్షర్ పటేల్ గురించి చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. అక్షర్ వైస్ కెప్టెన్ పదవి కోల్పోవడానికి కారణం ఆయన ఫామ్ కాదనీ, గిల్ ఎదుగుదల కారణమని ఆకాశ్ చోప్రా అన్నారు.
ఆసియా కప్ 2025 భారత జట్టు వైస్ కెప్టెన్ గా శుభ్ మన్ గిల్
ఇటీవల ఎంపికైన ఆసియా కప్ 2025 భారత జట్టులో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించారు. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. కానీ ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ 754 పరుగులు సాధించి అద్భుత ఫామ్‌తో అదరగొట్టాడు. దీంతో ఆసియా కప్ జట్టులో అక్షర్ పటేల్ కు బదులు గిల్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు.
ఆసియా కప్ 2025 భారత జట్టు వివరాలు
2025 ఆసియా కప్ కోసం 15 మంది ప్లేయర్లతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.
బ్యాట్స్‌మన్‌లు: సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్.
వికెట్ కీపర్స్: సంజూ శాంసన్, జితేష్ శర్మ.
ఆల్‌రౌండర్స్: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్.
బౌలర్లు: కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.
శ్రేయస్ అయ్యర్ ను తీసుకోకపోవడంపై వివాదం
శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేదు. ఇదే సమయంలో దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీలో పశ్చిమ జోన్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించారు. దీంతో ఆ బాధ్యత శార్దూల్ ఠాకూర్‌కు ఇచ్చారు. టోర్నమెంట్ సెమీఫైనల్ సెప్టెంబర్ 4-7 మధ్య జరగనుంది. కాగా, అయ్యర్ పేరు భారత వన్డే జట్టు భవిష్యత్ కెప్టెన్‌గా చర్చలో ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు దేశీయ క్రికెట్‌లో తన కెప్టెన్సీ సామర్థ్యాన్నిఅయ్యర్ చూపించారు.
2024 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించారు. రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతారనీ, ఆ తర్వాతి సిరీస్‌లలో అయ్యర్‌కు అవకాశం రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, భవిష్యత్‌లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్, జట్టులో ప్లేయర్ గా శ్రేయాస్ అయ్యర్ ను చూడవచ్చని ఆకాశ్ చోప్రా అన్నారు.