- Home
- Andhra Pradesh
- School Holidays: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని ఆ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
School Holidays: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని ఆ 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
School Holidays: అర్నాబ్ తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాల్లోని పాఠశాలలకు గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

11 జిల్లాల్లో బడులకు సెలవు.. కలెక్టర్ల కీలక ఉత్తర్వులు
అర్నాబ్ తీవ్ర తుపాను విరుచుకుపడటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థల భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో గురువారం (అక్టోబర్ 29) ఏకంగా 11 జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధర్ ప్రసాద్ విద్యార్థుల ప్రాణ భద్రత దృష్ట్యా మూడో రోజు కూడా విద్యాసంస్థలకు సెలవు పొడిగించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం యథావిధిగా స్కూళ్లు తెరుచుకుంటాయి.
ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రమాదం.. విద్యార్థులు, ప్రజలు జాగ్రత్త
తుపాను బలహీనపడినా వర్ష తీవ్రత తగ్గలేదని, హఠాత్తుగా వరదలు వచ్చే ముప్పు ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా పాఠశాల పిల్లలు, యువత వాగులు, వంకలు, పొంగిపొర్లే కాలువలు దాటే సాహసం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్ల కింద, పాత భవనాల వద్ద ఉండొద్దని సూచించారు. వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ల్యాండ్‌ఫాల్ వద్ద విధ్వంసం.. వణికించిన ప్రచండ గాలులు
నరసాపురం వద్ద తీరం దాటిన అర్నాబ్ తుపాను వినాశకరమైన పరిస్థితులను సృష్టించింది. తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పెద్ద సంఖ్యలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాజమండ్రి, గోపాలపట్నం ప్రాంతాల్లో ఏకంగా 31.6 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది.
పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లాలో 78 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, సముద్రంలోకి వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 68 బోట్లు కొట్టుకుపోయాయి. సముద్రంలో చెలరేగిన అలల ధాటికి ఉప్పాడ వద్ద ప్రధాన రహదారిపైకి పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకొచ్చాయి.
విపత్తులో చిక్కుకున్న గ్రామాలు.. సహాయక చర్యల్లో NDRF, SDRF
తుపాన్ బీభత్సానికి తీర ప్రాంత గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్లు దెబ్బతినడంతో కోనసీమ, కాకినాడ పరిధిలోని పలు గ్రామాలు వరుసగా మూడో రోజు కూడా అంధకారంలోనే ఉండిపోయాయి. విపత్తు సహాయక చర్యల కోసం ప్రభుత్వం 16 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించింది.
కాలువలు, వాగుల వద్ద రక్షణ గోడలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోర్టుల్లోనూ డేంజర్ సిగ్నల్స్ కొనసాగుతున్నాయి. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అన్నదాతల కంటతడి.. తెలంగాణకూ అలర్ట్
తుఫాన్ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. కోనసీమ, గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, అరటి పంటలు నీట మునిగాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే లక్షా 18 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనావేశారు.
మరోవైపు, తెలంగాణలోనూ అర్నాబ్ ప్రభావంతో రెయిన్ అలర్ట్ జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వాతావరణం చల్లబడటంతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు, దక్షిణ మధ్య రైల్వేలో 27 రైళ్లు రద్దయ్యాయి.





