- Home
- Andhra Pradesh
- Rain Alert : అల్పపీడనాలు, వాయుగుండాలు కాదు ఇప్పుడు ద్రోణి ... ఈ ప్రాంతాల్లో ప్రమాదకరమైన వర్షాలు
Rain Alert : అల్పపీడనాలు, వాయుగుండాలు కాదు ఇప్పుడు ద్రోణి ... ఈ ప్రాంతాల్లో ప్రమాదకరమైన వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బుధవారం ఏఏ జిల్లాల్లో ఇలాంటి వానలుపడే అవకాశం ఉందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
Rain Alert : నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలయ్యింది... అయినా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. గత రెండు నెలలుగా (ఆగస్ట్, సెప్టెంబర్) కుండపోత వర్షాలు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణను ముంచెత్తుతూనే ఉన్నాయి. వర్షాకాలం ముగుస్తుంది కాబట్టి అక్టోబర్ లో ఈ వానల నుండి ఊరట లభిస్తుందని తెలుగు ప్రజలు భావించారు. కానీ ఈ నెలంతా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీ, తెలంగాణ ప్రజలను కంగారు పెడుతున్నాయి.
బుధవారం ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ద్రోణి ప్రభావంతో బుధవారం(08-10-25) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే
నిన్న (అక్టోబర్ 7, మంగళవారం) రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటలవరకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90మిమీ, అనకాపల్లిలో 70.5మిమీ, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 66.5మిమీ, కాకినాడ జిల్లా కోటనందూరులో 64.7మిమీ, నెల్లూరు జిల్లా చినపవానిలో 57మిమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా పైనంపాడు 56. 5మిమీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ జిల్లాల్లో పిడుగుల ప్రమాదం
ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో రెడ్ అలర్ట్ జారీచేసింది APSDMA. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్... పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో వర్షసమయంలో పిడుగులు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి ప్రజలు చెట్లకింద కాకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
APSDMA హెచ్చరించినట్లే శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటు పెను ప్రమాదం సృష్టించింది. గంగరాజుపురంలోని రాజ్‌యోగ్ మినరల్ గ్రానైట్ క్వారీలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందగా మరో కార్మికుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఇద్దరు రాజస్థాన్, ఒకరు బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు... బ్రతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం తెలంగాణలో వర్షాలు
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తెలంగాణలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ (అక్టోబర్ 8, బుధవారం) కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ క, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించారు.