October Rain Alert : ఈ అక్టోబర్ లోనూ అల్లకల్లోలమే .. 10+10+11 వెదర్ రిపోర్ట్
October Rain Alert : నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గేలా కనిపించడంలేవు. అక్టోబర్ మొత్తం వర్షాలు కురుస్తాయంటూ 10+10+11 వెదర్ రిపోర్ట్ అందించారు తెలంగాణ వెదర్ మ్యాన్.

అక్టోబర్ లో వానలే వానలు
October Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు వస్తూవస్తూనే జోరువానలు తీసుకువచ్చాయి... మధ్యలో కాస్త కంగారుపెట్టినా ఆగస్ట్, సెప్టెంబర్ లో దంచికొట్టాయి. ప్రస్తుతం వర్షాకాలం ముగింపుకు చేరుకున్నా వానలు తగ్గడంలేదు... అక్టోబర్ మొత్తం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలను మూడు భాగాలుగా విభజించి (10+10+11) వర్షాల గురించి తెలియజేశారు తెలంగాణ వెదర్ మ్యాన్... మొత్తంగా ఈ నెలలో కూడా వర్షాలు విడిచిపెట్టవని చెబుతున్నారు.
ఈ నెలలో కుండపోత వర్షాలు తప్పవా?
జూన్-సెప్టెంబర్ నాలుగు నెలలు వర్షాకాలం. అక్టోబర్ లో మెల్లిగా వర్షాలు తగ్గి చలి ప్రారంభం అవుతుంది. కానీ ఈసారి అలాకాదు... ఆగస్ట్, సెప్టెంబర్ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెబుతున్నారు. పది రోజులకు ఓసారి వాతావరణ పరిస్థితుల్లో మార్పులుంటాయని హెచ్చరిస్తున్నారు.
ఈ వారమంతా వానలే వానలు
అక్టోబర్ 1-10 వరకు ఉత్తర, తూర్పు, సెంట్రల్ తెలంగాణలో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదన్ మ్యాన్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా పదిరోజులు జోరువానలు కురుస్తాయని హెచ్చరించారు.
అక్టోబర్ మధ్యలో వర్షాలు ఎలా ఉండనున్నాయి?
ఇక అక్టోబర్ 10 నుండి 20 వరకు తెలంగాణవ్యాప్తంగా మోస్తరు వర్షాల కురిసే అవకాశాలున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సమయం... కాబట్టి వర్షతీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పదిరోజుల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయని... మిగతాప్రాంతాల్లో ఎక్కువరోజులు పొడి వాతావరణమే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
అక్టోబర్ చివర్లో దంచికొట్టనున్న వానలు
అక్టోబర్ చివర్లో ఈశాన్య రుతువపనాలు తెలంగాణలో వ్యాపిస్తాయని... దీంతో మళ్లీ భారీ వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇలా అక్టోబర్ 21 నుండి 31 వరకు సౌత్, ఈస్ట్ తెలంగాణ జిల్లాలు మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ బార్డర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
నేడు తెలంగాణలో వర్షాలు
ఇదిలావుంటే అక్టోబర్ 7, మంగళవారం తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలుకురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీచేసింది.
నేడు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.