- Home
- Andhra Pradesh
- మళ్లీ వర్షాలు బాబోయ్.. ఏకంగా రెండు అల్ప పీడనాలు. ఈ ప్రాంతాల్లో ఆకాశంలో అల్లకల్లోలం ఖాయం
మళ్లీ వర్షాలు బాబోయ్.. ఏకంగా రెండు అల్ప పీడనాలు. ఈ ప్రాంతాల్లో ఆకాశంలో అల్లకల్లోలం ఖాయం
Rain Alert: మొంథా తుఫాన్‌తో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారం రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

నైరుతి బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. ఈ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి దాదాపు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దక్షిణ కోస్తా తీరం వెంట ఈదురుగాలులు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో గంటకు 35–55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు. సముద్ర పరిస్థితులు కఠినంగా ఉండే అవకాశంతో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.
నవంబర్ 17న (సోమవారం) వర్షాల అంచనా
సోమవారం రోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
నవంబర్ 18న (మంగళవారం) వాతావరణ పరిస్థితులు
మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తిరిగి పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని విపత్తుల సంస్థ తెలిపింది. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముంది.
నవంబర్ 21న మరో అల్పపీడనం
నవంబర్ 21 ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. ప్రస్తుత నమూనాల ప్రకారం, ఈ కొత్త వ్యవస్థ ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు ఈ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని సాగు పనుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.