ఎన్ని కష్టాలొచ్చినా ఓపిక ఉంటే చాలు.. ఈ కథ చదివితే మీ కళ్లు తెరుచుకోవడం ఖాయం
Motivational story: జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం. అయితే చాలా మంది కష్టాలను భరించలేక త్వరగా విజయం రావాలని భావిస్తారు. అయితే ఓపికతో ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకొని విజయం సాధించవచ్చు. అదేలాగంటే..

త్వరగా విజయం రావాలి
ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. ఎలాగైనా త్వరగా విజయం రావాలి, కష్టాలన్నీ తొలగిపోవాలని పట్టుపట్టేవాడు. ఇందులో భాగంగానే ఓ స్వామి దగ్గరకు వెళ్తాడు. తన కష్టాలు వెంటనే తీరి, విజయం రావాలి ఇందుకోసం ఏం చేయాలని అడుగుతాడు.
గురువు ఇచ్చిన సవాలు
“నాకు వెంటనే విజయం సాధించే మార్గం చెప్పండి” అని రవి అడగడంతో స్వామి నవ్వుతూ ఒక పని చేయమని చెప్తాడు. రవికి ఒక విత్తనం ఇచ్చి.. “ఈ విత్తనాన్ని నాటి, ప్రతిరోజూ నీళ్లు పోయు, దీని పెరుగుదలని గమనించు. ఇది నీకు కావాల్సిన జవాబు ఇస్తుంది” అని చెప్పారు.
మొదట్లో నిరాశ
రవి విత్తనం నాటి, రోజూ నీళ్లు పోశాడు. కానీ రెండు రోజులు… మూడు రోజులు… వారం గడిచినా మొక్క బయటకు రాలేదు. “ఇంత చిన్న పని కూడా ఫలితం చూపడం లేదు! విజయం ఎలా సాధిస్తాను?” అంటూ బాధపడుతుంటాడు. ఇక తన జీవితం మారదంటూ వాపోతుంటాడు.
ఓపికతో వచ్చిన మార్పు
ఈ విషయాన్ని స్వామీజికి చెప్పగా.. ఏం బాధ పడకు. ప్రతీ రోజూ ఓపికతో నీళ్లు పోయమని చెప్తాడు. దీంతో చేసేది ఏం లేక రవి స్వామి చెప్పిన పని చేస్తాడు. దీంతో ఓ ఉదయం.. భూమిని చీల్చుకుంటూ చిన్న మొగ్గ బయటకు వచ్చింది. ఇది చూసిన రవి ఎంతో ఆనందించాడు.
ఓపికనే గెలిపించింది
ఆ విషయాన్ని స్వామీజీకి తెలపగా ఆయన మాట్లాడుతూ.. “నీ ఓపిక వల్లే ఇది సాధ్యమైంది. నీకు కనిపించని రోజులలో విత్తనం భూమి లోపల చీకటిని, వేడిని తట్టుకుంది. సమయం వచ్చే సరికి బయటకు వచ్చింది. నువ్వు కూడా ఇప్పుడు కష్టాలను ఎదుర్కునే దశలో ఉన్నావు. కాబట్టి ఓపికతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే.. కచ్చితంగా విజయం సాధిస్తావు” అని చెప్తాడు. దీంతో రవికి అసలు విషయం అర్థమవుతుంది.
గొప్ప నీతి
ఫలితం ఆలస్యంగా వచ్చినా, శ్రమ వృథా కాదు. ఓపిక ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. చిన్న మొక్కలా మన ప్రయత్నాలు కూడా మొదట కనిపించకపోయినా, లోపల పెరుగుతూనే ఉంటాయి అనే గొప్ప నీతిని ఈ కథ అందిస్తోంది.