'టీడీపీ వాళ్లు ఎన్టీఆర్ వార్2 చూడొద్దు'.. ఈ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్2 సినిమా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతోన్న వేళ.. చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది.

అనంతపురంలో వార్-2 వివాదం
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇబ్బందుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీక్ అయిన ఆడియో
లీకైన ఆడియోలో, “టీడీపీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ సినిమా చూడటంలో అర్థమేంటి?” అన్నట్లుగా వినిపించడంతో, అభిమానుల్లో కోపం చెలరేగింది. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అభిమానులు ధర్నాకు దిగారు. “లోకేశ్ పేరు వస్తే సినిమా ఆపేయాలి” అనే హెచ్చరిక ఆడియోలో వినిపించడంతో, ఆగ్రహం మరింత పెరిగింది.
జిల్లాల వారీగా విస్తరిస్తున్న నిరసనలు
అనంతపురంలో మొదలైన ఈ ఆందోళనలు, క్రమంగా రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాలకు వ్యాపించాయి. ప్రతి ప్రాంతంలోనూ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామం టీడీపీ లోపల కూడా చర్చనీయాంశంగా మారింది.
సీఎం చంద్రబాబు అసంతృప్తి
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు, వ్యక్తిగత అహంకారాలు, వర్గపోరాటాలు టీడీపీ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చని హెచ్చరించారు. ప్రజలలో తప్పు సంకేతాలు వెళ్లేలా ప్రవర్తించొద్దని స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఖండించారు. లీకైన ఆడియో తనది కాదని, రాజకీయంగా తనను దెబ్బ తీసేందుకే ఈ కుట్ర చేశారన్నారు. “నేను ఎప్పుడూ నందమూరి–నారా కుటుంబాలకు అభిమానిని. అలాంటి మాటలు చెప్పడం అసంభవం” అని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్టు స్పష్టం చేశారు.