- Home
- Andhra Pradesh
- Andhra Pradesh High Court: మతం మారితే ఎస్సీ హోదా ఉండదు.. అట్రాసిటీ కేసు చెల్లదు: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Andhra Pradesh High Court: మతం మారితే ఎస్సీ హోదా ఉండదు.. అట్రాసిటీ కేసు చెల్లదు: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
No SC Status After Religious Conversion: మతం మారితే ఎస్సీ హోదా ఇక ఉండదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మతం మారిన వారు ఎస్సీ హోదా ద్వారా చట్టబద్ధ రక్షణలు పొందలేరని స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగ ఉద్దేశాలకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మతం మారిన తర్వాత ఎస్సీ హోదా చెల్లదు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ప్రకటించిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్ అనే క్రైస్తవ పాస్టర్ దాఖలు చేసిన ఎస్సీ/ఎస్టీ కేసు పై విచారణలో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా అమలులో ఉండదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ తన తీర్పులో క్రైస్తవ మతంలో కుల వ్యవస్థే లేదంటే ఎస్సీ చట్టం ఎలా వర్తిస్తుంది? అని ప్రశ్నించారు.
కేసు నేపథ్యం ఏమిటి?
2021లో చింతాడ ఆనంద్ పాస్టర్ చంద్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ప్రార్థన సమావేశం నిర్వహిస్తుండగా, అక్కల రామిరెడ్డి, ఇతరులు తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్లు ప్రకారం కేసు నమోదైంది. తర్వాత ఛార్జ్‌షీట్ కూడా దాఖలయ్యింది. కానీ రామిరెడ్డి వాదన ప్రకారం ఆనంద్ గత 10 ఏళ్లుగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నాడని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మత మార్పుతో వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోతాడు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేనందున, ఆ మతానికి చెందినవారికి ఎస్సీ చట్టం వర్తించదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కామెంట్స్ చేసింది. ఆనంద్ వద్ద ఎస్సీ కులం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఆ సర్టిఫికెట్ చట్టబద్ధ రక్షణను కల్పించదని స్పష్టంగా పేర్కొంది.
కేవలం కులం సర్టిఫికెట్ ఆధారంగా ఎస్సీ చట్టం వర్తించదని పేర్కొంది. పోలీసులు విచారణ లేకుండానే కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పాస్టర్ గా ఆయన భార్య సహా సాక్షులను అతను మత మార్పు చేశాడని తెలిపిన నేపథ్యంలో సంచలన తీర్పును ఇస్తూ కోర్టు కేసును కొట్టివేసింది.
ఈ కేసులో తీర్పు క్రమంలో హైకోర్టు ఇంతకుముందున్న కొన్ని ప్రధాన తీర్పులను కూడా ప్రస్తావించింది. 2024 నవంబర్ 26న సుప్రీంకోర్టు ప్రస్తావించిన విషయాలను గుర్తు చేస్తూ.. మతాన్ని నిజమైన విశ్వాసంతో కాకుండా రిజర్వేషన్ కోసం మార్చడం రాజ్యాంగాన్ని మోసం చేయడమేని పేర్కొంది. 2023లో మద్రాస్ హైకోర్టు ఒక వ్యక్తి మతం మారాక మునుపటి కులం హోదా వర్తించదని స్పష్టం చేసింది.