- Home
- Andhra Pradesh
- Chandrababu Naidu : సామాన్య రైతుబిడ్డ సంపన్న సీఎం ఎలా అయ్యారు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?
Chandrababu Naidu : సామాన్య రైతుబిడ్డ సంపన్న సీఎం ఎలా అయ్యారు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కూడా. రెండెకరాల రైతు బిడ్డ ఈ స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా…? స్పూర్తిదాయకమైన ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం చంద్రబాబు... ఆయన ఆస్తులెన్నో తెలుసా?
Nara Chandrababu Naidu : ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి... కానీ దేశ రాజకీయాల ప్రభావితం చేయగల నాయకుడు. ప్రస్తుతం ఆయన మద్దతుతోనే కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిందని... నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత పవర్ ఫుల్ పొలిటీషన్ ఇంకెవరో కాదు మన తెలుగు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా వ్యవహరిస్తున్నారు.
రాజకీయ నాయకుడిగానే చంద్రబాబు నాయుడు దేశ ప్రజలకు పరిచయం. కానీ ఆయనలో ఓ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా దాగున్నారు. ఆయన తన సొంతజిల్లాలో చిన్నగా స్థాపించిన హెరిటేజ్ సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది... వేలకోట్లు బిజినెస్ చేస్తోంది. అందువల్లే ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకానిది చంద్రబాబు సాధించారు... ఆయన కుటుంబానికి ప్రస్తుతం రూ.1000 కోట్లకుపైగా ఆస్తులున్నారు. దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు గుర్తింపుపొందారు.
కేవలం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల నెట్ వర్త్ రూ.932 కోట్లు ఉంటుంది. చంద్రబాబు పేరిట కేవలం రూ.36 కోట్ల ఆస్తులే ఉన్నాయి... కానీ ఆయన భార్య పేరిట ఏకంగా రూ.895 కోట్ల ఆస్తులున్నాయని గతంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా చంద్రబాబు దంపతుల ఆస్తుల విలువను లెక్కగట్టింది ఏడిఆర్.
రూ.932 కోట్లు కేవలం చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల ఆస్తుల విలువే. వీరి తనయుడు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ పేరిట కూడా భారీ ఆస్తులున్నాయి. ఇవన్నీ కలిపితే చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు రూ.1000 కోట్ల కంటే ఎక్కువే. దీంతో సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డే కాదు రిచ్చెస్ట్ సీఎం రికార్డు కూడా చంద్రబాబుకు సొంతమయ్యింది.
రైతుబిడ్డ నుండి సంపన్న సీఎం వరకు చంద్రబాబు ప్రయాణం
చంద్రబాబు నాయుడు దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయలసీమలో పుట్టిపెరిగారు. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెకు చెందిన ఖర్జూర నాయుడు, అమనమ్మ దంపతులకు నలుగురు సంతానం... వారిలో ఒకరు చంద్రబాబు. రెండెకరాల సన్నకారు రైతు ఖర్జూర నాయుడు పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టలేదు... కానీ మంచి విద్యాబుద్దులు అందించారు. అందువల్లే చంద్రబాబు నాయుడు ఈస్థాయికి రాగలిగారు.
కాలేజీ రోజుల్లో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న చంద్రబాబు స్టూడెంట్ యూనియన్ లో చేరిపోయాడు. ఇలా విద్యార్థి దశలో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. 1978 లో మొదటిసారి చంద్రగిరి నుండి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు... అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1982 లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కూతురు భువనేశ్వరిని పెళ్లాడారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఉమ్మడి రాష్ట్రానికే కాదు విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు సీఎం అయ్యారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన రికార్డు ఇప్పటికీ చంద్రబాబు పేరిటే ఉంది.
వేలకోట్ల హెరిటేజ్ బిజినెస్
నారా చంద్రబాబు మంత్రిగా ఉండగా డెయిరీ ఉత్పత్తులను తయారుచేసే హెరిటేజ్ సంస్థను స్థాపించారు. తన సొంత జిల్లా చిత్తూరులో మొదటి హెరిటేజ్ చిల్లింగ్ యూనిట్ ప్రారంభించారు. దాదాపు రెండేళ్లు మేనేజింగ్ చంద్రబాబు నాయుడు ఈ హెరిటేజ్ కు డైరెక్టర్ గా వ్యవహరించారు. 1994లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తన భార్య భువనేశ్వరికి ఈ హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు.
అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలాగే హెరిటేజ్ ఫుడ్స్ జర్నీ కూడా సక్సెస్ ఫుల్ గా సాగింది. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సంస్థ మార్కెట్ వాల్యూ రూ.4,400 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.
కోవిడ్ సమయంలో చాలా సంస్థలు తీవ్ర నష్టాలను చవిచూసాయి... కానీ హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం బలంగా నిలబడింది. ఆ గడ్డుకాలంలో కూడా ఈ సంస్థకు ఎలాంటి నష్టాలు లేవంటే ఎంత స్ట్రాంగ్గా దీన్ని నిర్మించారో అర్థమవుతుంది. ప్రస్తుతం చంద్రబాబు భార్య భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, కోడలు బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
హెరిటేజ్ లో చంద్రబాబు కుటుంబవాటా ఎంత?
హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు కుటుంబానిదే అత్యధిక వాటా... మొత్తం 35.7 శాతం షేర్లు వీరివే. ఇందులో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి 24 శాతం,కొడుకు నారా లోకేష్ కు 10 శాతం వాటా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న లోకేష్ భార్య బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. ఇక చంద్రబాబు మనవడు, లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ 0.06 శాతం షేర్లు కలిగివున్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను చూస్తే భువనేశ్వరి అత్యధికంగా 2,26,11,525 కలిగివున్నారు. లోకేష్ 1,00,37,453 షేర్లు కలిగివున్నారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ హెరిటేజ్ ఫుడ్స్ ను స్థాపించిన చంద్రబాబు నాయుడు పేరిట ప్రస్తుతం ఒక్క షేర్ కూడా లేదు... ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేముందే అన్నింటిని భార్యపేరుపైకి బదిలీ చేశారు. చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో హెరిటేజ్ షేర్ల విలువే అత్యధికం.
కొడుకు కుటుంబంతో కలిపి చంద్రబాబు ఆస్తులెంతో తెలుసా?
ఎన్నికల అఫిడవిట్ లో కూడా భార్య భువనేశ్వరి పేరిట వున్న హెరిటేజ్ షేర్ల విలువను చూపించారు చంద్రబాబు. అలాగే మిగతా ఆస్తులను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఇప్పుడు దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా గుర్తింపు పొందారు.
చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి దంపతుల పేరు మీద 932 కోట్ల ఆస్తులు ఉండగా.. నారా లోకేష్ కుటుంబ ఆస్తులు విలువ 542 కోట్ల వరకూ ఉంది. మొత్తంగా చంద్రబాబు, లోకేష్, ఇతర కుటుంబసభ్యులతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.1473 కోట్లుగా ఉంది. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన ఎన్నికల సమయానికి చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ 39 శాతం పెరిగింది.