బందరులో అందరివాడు.. అభివృద్ధిలో తిరుగులేదు.. వందరోజుల్లో ఎంపీ బాలశౌరి ప్రగతి ప్రస్థానం
మూడుసార్లు ఎంపీగా తిరుగులేని విజయం సాధించిన బాలశౌరి.. ప్రజలకు అత్యంత చేరువయ్యారు. అటు, జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ నియోజకవర్గానికి నిధులు సాధిస్తున్నారు. ఇలా మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన 100 రోజుల్లోనే గుర్తుంచుకోదగ్గ అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టి శెభాష్ అనిపించుకుంటున్నారు.
జనసేన ఎంపీ బాలశౌరి ఆ పార్టీలోనే కాదు.. రాజకీయాల్లోనూ ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు. జనసేనలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక మెజారిటీతో మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో విజయం సాధించిన ఆయన... ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన సీనియర్ పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి. ఈ పేరు జనసేనలో గట్టిగా వినిపిస్తుంది. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. అదేవిధంగా, మచిలీపట్నం పార్లమెంట్‌ను అభివృద్ది పథంలో నడిపిస్తున్న తీరు, లోక్‌సభలో తన పార్లమెంట్‌లోని సమస్యలపై ప్రస్తావించడం, నియోజకవర్గ అవసరాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధించడం ద్వారా ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అందరివాడులా పేరు తెచ్చుకున్నారు ఎంపీ బాలశౌరి.
మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా తిరుగులేని విజయం సాధించిన బాలశౌరి జాతీయ స్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ అవసరమైన కోట్ల రూపాయల నిధులు సాధిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన 100 రోజుల్లోనే గుర్తుంచుకోదగ్గ అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టారు.
ఎన్నో ఏళ్లుగా బందరును పట్టిపీడిస్తున్న మురుగు సమస్యకు చెక్ పెడుతున్నారు. ఇందుకోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంపై అధ్యయనానికి కేంద్ర నుంచి అధికారులను పిలిపించారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ప్రత్యేక శ్రద్ద తీసుకుని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే, ఎంపీ బాలశౌరి అభ్యర్థన మేరకు మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ లైన్ కూడా నిర్మిస్తే దివిసీమ ప్రజల చిరకాలకోరిక ''మచిలీపట్నం-రేపల్లే రైల్వే లైన్'' సాకారం అవుతుంది.
గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం అభివృద్ధికి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంతగానో కృషి చేశారు. గన్నవరం నుంచి సుదూర ప్రాంతాలకు అవసరమైన విమాన సర్వీసులు ప్రారంభం కావడంలో కీలకంగా పనిచేశారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులు, విమాన సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టి... వాటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న గన్నవరం- ముంబయి డైరెక్ట్ విమాన సర్వీసును ఎంపీ బాలశౌరి తీసుకొచ్చారు. ఈ విమాన సర్వీసు రాకతో అమరావతి నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కనెక్టింగ్ ఫ్లైట్‌గా ఉపయోగపడుతోంది. అలాగే, ఇటీవలే ముంబయి, ఢిల్లీకి వేర్వేరు సర్వీసులను ఏర్పాటు చేశారు. గన్నవరం నుంచే దుబాయ్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసు తీసుకురావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఇటీవల కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక ఎయిర్‌పోర్టులో జరుగుతున్న నూతన టెర్మినల్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తిచేసేందుకు బాలశౌరి కృషి చేస్తున్నారు.
విపత్తుల్లో బాసటగా...
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. ప్రత్యేకించి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఆ పరిస్థితులపై అందరికంటే ముందుగానే స్పందించారు ఎంపీ బాలశౌరి. వరదల కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి నేరుగా లేఖ రాశారు. గతంలో బీహార్ మాదిరిగా ఏపీకి సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌లను కోరారు. దేశంలోని ఎంపీలందరూ ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించాలని పిలుపునిచ్చారు.
అంతటితో ఆగకుండా...ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల వచ్చిన కేంద్ర విపత్తుల ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ సభ్యులతో ఎంపీ బాలశౌరి సమావేశమయ్యారు. వరదల వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రెయిన్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయని వివరించారు. కృష్ణా నది, బుడమేరు వరదల వల్ల అనేక మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయని... కొందరి ఇళ్లు పూర్తిగా నీటమునిగాయన్నారు. వరదల సమయంలో ముంపు ప్రాంతంలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎంపీ బాలశౌరి. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐవోసీఎల్ ద్వారా దాదాపు రూ.15 లక్షలు నిధులు తీసుకొచ్చి 500 కుటుంబాలకు నిత్యావసర సరకులు, వంటసామాగ్రి అందజేశారు.
పార్లమెంట్‌లో గళమెత్తి.. నిధులు రాబట్టి..
మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రస్తావించారు. దాంతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి లేఖలు అందజేశారు. ఇంటింటికీ తాగునీరు అందించాలని జల్‌జీవన్ మిషన్ పనులకు కృష్ణా జిల్లాకు సంబంధించి రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. దివిసీమ ప్రజల చిరకాలకోరిక మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సంబంధిత మంత్రిని కలిసి లేఖలను అందజేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.