భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ!.. జగన్ తో ఢీకి వ్యూహం ఇదే...
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాజకీయ వేడి కొనసాగుతుంది. జనసేన పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. అయితే ఈసారి పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది.
గత ఎన్నికల్లో రెండు చోట్ల (భీమవరం, గాజువాక) నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. రెండు చోట్ల ఓటమి చెందారు. అయితే ఈసారి బలంగా ప్రజల్లోకి వెళ్తున్న పవన్ కల్యాణ్.. మళ్లీ భీమవరం నుంచే పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కల్యాన్ స్పల్ప మెజారిటీతోనే ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భీమవరంలో త్రిముఖ పోరు నెలకొంది. అక్కడ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌కు 70 వేల ఓట్లు, పవన్‌కు 62 వేల ఓట్లు, టీడీపీ అభ్యర్థి రామాంజనేయులకు 54 వేల ఓట్లు వచ్చాయి.
అయితే భీమవరంలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గంతో పాటు.. ఆయనకు మద్దతుదారులు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పూర్తిగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి సారించారని చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవ్వనివ్వకూడదని కూడా పిలుపునిస్తున్నారు. భీమవరం నుంచి తాను పోటీ చేసిన పక్షంలో.. చుట్టుపక్కల ఉన్న మిగిలిన నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉంటుందని పవన్ లెక్కలు వేసుకుంటున్నట్టుగా సమాచారం. జగన్ ను ఢీకొట్టి వైసిపిని దెబ్బ తీయడానికి మార్గం ఇదేనని పవన్ భావిస్తున్నారు.
ముఖ్యంగా పవన్ ఇటీవలికాలంలో భీమవరంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని జనసేన వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై భీమవరం నియోజకవర్గంలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందని.. ఇవన్నీ తమకు లాభించే అంశాలని పవన్ లెక్కలు వేసుకుంటున్నారు.
ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే.. భీమవరంలో పవన్ గెలుపు ఖాయమనే విశ్లేషణ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు పోలైన ఓట్లను పరిశీలిస్తే.. వైసీపీ అభ్యర్థి సాధించిన ఓట్ల కన్నా 45 వేలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు ఉంటుందని కూడా చెప్పారు. భీమవరం నుంచి పోటీ చేయాలని తాను కోరగా.. జనసేనాని సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఇక, రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ నియోజకర్గం ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే.. ఆ ప్రభావం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నమ్మకంతోనే పవన్ అక్కడ వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూస్తానని కామెంట్స్ చేస్తూ ఉన్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇలా, ఏ విశ్లేషణ పరిగణలోకి తీసుకున్న పవన్ రానున్న ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసేందుకు మెండుగానే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గతంలో మాదిరిగా పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారా?.. లేకపోతే ఒక్క స్థానం నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అనేది మాత్రం చూడాల్సి ఉంది.