- Home
- Andhra Pradesh
- Gold : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేట్ బంగారు గని.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు తగ్గుతాయా?
Gold : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేట్ బంగారు గని.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు తగ్గుతాయా?
Indias First Private Gold Mine: ఇండియాలోని తొలి ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరిలో ఉంది. త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. ప్రతి సంవత్సరం 750 కిలోల గోల్డ్ ఉత్పత్తి అవుతుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు తగ్గుతాయా?

భారత తొలి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి
భారతదేశంలోని తొలి పెద్ద ప్రైవేట్ బంగారు గని త్వరలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని జొన్నగిరిలో ఉన్న ఈ బంగారు గని అప్డేట్ ను డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ తెలిపారు. దేశం బంగారం దిగుమతులపై తీవ్రంగా ఆధారపడుతున్న సమయంలో ఈ అప్డేట్ ప్రాముఖ్యత సంతరించుకుంది.
కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి సమీపంలో బంగారు గని
ఈ బంగారు గని కర్నూల్ జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దీనిలో భాగస్వామిగా ఉంది.
జొన్నగిరి గోల్డ్ మైన్ ఎంత బంగారం ఉత్పత్తి చేయనుంది?
జొన్నగిరి బంగారం ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ప్రతి సంవత్సరం సుమారు 750 కిలోల గోల్డ్ ఉత్పత్తి చేయనుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో ఉత్పత్తి సామర్థ్యం 1,000 కిలోల వరకు పెరగనుంది. ప్రస్తుతం భారతదేశం సంవత్సరానికి కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. జొన్నగిరి గని ప్రారంభమైతే దాదాపు ఒక టన్ను అదనంగా ఉత్పత్తి అవుతుందని హనుమ ప్రసాద్ తెలిపారు.
బంగారం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్
భారత్ ప్రతి సంవత్సరం సుమారు 1,000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశంలో నూనె తర్వాత రెండవ పెద్ద దిగుమతిగా ఉంది. ఈ గని ప్రారంభమైతే బంగారం దిగుమతి పై ఆధారపడటం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
జొన్నగిరి బంగారు ప్రాజెక్ట్‌కు జూన్, జూలై నెలల్లో పర్యావరణ అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగుతోందని డెక్కన్ గోల్డ్ మైన్స్ ఎండీ తెలిపారు. “ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ప్లాంట్ టెక్నాలజీపై పని జరుగుతోంది. పూర్తి స్థాయి ఉత్పత్తి త్వరలోనే ప్రారంభమవుతుంది” అని ఆయన CII India Mining Summit 2025 సందర్భంగా తెలిపారు.
భారతదేశంలో తొలి లిస్టెడ్ గోల్డ్ కంపెనీ డెక్కన్ గోల్డ్ మైన్స్
డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ 2003లో స్థాపించారు. ఇది భారతదేశంలో బీఎస్ఈలో లిస్టెడ్ అయిన తొలి గోల్డ్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ. ఈ సంస్థ భారతదేశంతో పాటు కిర్గిజిస్తాన్, ఫిన్లాండ్, టాంజానియా దేశాల్లో కూడా గనుల అన్వేషణలో ఉంది. భారత గనుల రంగంలో ప్రైవేట్ రంగానికి మార్గం చూపుతున్న DGML, జొన్నగిరి ప్రాజెక్ట్ ద్వారా దేశీయ బంగారం ఉత్పత్తిని పెంచే దిశగా ముందడుగు వేసింది.
జొన్నగిరి బంగారం గనితో తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరల పై ప్రభావం ఉంటుందా?
జొన్నగిరి బంగారు గని ప్రారంభం భారత గనుల పరిశ్రమకు చారిత్రాత్మక ఘట్టం కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం ఉత్పత్తి జరుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో దేశీయ ఉత్పత్తి పెరిగి, బంగారం దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. ఇది కొంతవరకు బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలపై జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇక్కడ బంగారం ధరలు ఏమీ తగ్గవు. అంతర్జాతీయ ప్రభావం, దేశంలో ఉన్న డిమాండ్ కారణంగా బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
శనివారం దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగి కొత్త రికార్డులను నెలకొల్పాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹1,10,700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ₹1,20,770గా ఉంది.