IMD Rain Alert : ఓ ఉపరితల ఆవర్తనం, మరో ద్రోణి ... ఈ ప్రాంతాల్లో ప్రమాదకర వర్షాలు
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ ప్రాంతాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
IMD Rain Alert : వర్షాకాలం ఎప్పుడో ముగిసింది.. వానలు కురిపించే నైరుతి రుతుపవనాలు నెల క్రితమే దేశాన్ని వీడాయి. కానీ తెలుగు రాష్ట్రాలను మాత్రం వర్షాలు వదిలిపెట్టడంలేదు. ఇంకా చెప్పాలంటే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులతో వర్షాకాలంలో కంటే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల మొంథా తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి బీభత్సం సృష్టించిందో చూశాం. తెలంగాణలో కూడా భారీ వర్షాలను కురిపించింది. ఈ మొంథా తుపాను బీభత్సాన్ని మర్చిపోకముందే మళ్లీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... ఇది తెలుగు ప్రజలను కాస్త ఆందోళనకు గురిచేసే అంశం.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక ఇప్పటికే కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందట. వీటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDMA ప్రకటించింది.
ఏపీలో నేడు పిడుగులతో కూడిన వర్షాలు
ఇవాళ (నవంబర్ 6, గురువారం) కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. వర్ష సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... కాబట్టి ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే
నిన్న (నవంబర్ 5, బుధవారం) ఏపీలో మోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 4 గంటల వరకు ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో అత్యధికంగా 65.2మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఇక శ్రీసత్యసాయి జిల్లా గండ్లపెంటలో 45మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్ 40.5మిమీ, విజయవాడ తూర్పులో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని APSDMA తెలిపింది.
నేడు తెలంగాణలో వర్షాలు
ఇక తెలంగాణలో కూడా గురువారం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కిమీ వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.