- Home
- Andhra Pradesh
- IMD Rain Alert: మరో గండం.. వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
IMD Rain Alert: మరో గండం.. వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
IMD Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి వరణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతం–శ్రీలంక తీరప్రాంతంలో కొత్త అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవస్థ నైరుతి దిశగా ప్రయాణిస్తూ శ్రీలంక తీరాన్ని తాకినట్లు సమాచారం. ఈ మార్పుల కారణంగా సముద్రంపై గాలుల వేగం పెరుగుతుండగా, వాతావరణంలో తేమ కూడా ఎక్కువవుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలపై స్పష్టంగా కనిపించనుంది.
రెండు రోజులపాటు వర్షాలు…
వచ్చే రెండు రోజులపాటు ఏపీలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
* తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35–55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సూచించింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగి, కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీలకు పడిపోగా, మరికొన్నిచోట్ల 35 డిగ్రీల వేడి నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షాల హెచ్చరిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
సోమవారం–మంగళవారం వర్ష సూచనలు
* సోమవారం (నవంబర్ 17)
నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి: పిడుగులతో కూడిన మోస్తరు–భారీ వర్షాలు
ప్రకాశం, కడప: తేలికపాటి–మోస్తరు వర్షాలు
* మంగళవారం (నవంబర్ 18)
నెల్లూరు, తిరుపతి: మోస్తరు–భారీ వర్షాలు
ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు: తేలికపాటి–మోస్తరు వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అలర్ట్ జారీ చేస్తూ, పిడుగుల సమయంలో బయట కార్యకలాపాలు తగ్గించాలని సూచించింది.
మత్స్యకారులకు కీలక హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో సముద్ర తీరం వెంబడి గాలి వేగం గంటకు 55 కిమీ వరకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా సముద్రం లోనికి ప్రవాహాలు పెరగడంతో ప్రమాద పరిస్థితులు తలెత్తవచ్చు.
సోమవారం (17వ తేదీ) వరకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు స్పష్టంగా హెచ్చరించింది. తీరప్రాంత గ్రామాల్లో నివసించే ప్రజలు గాలుల వేగం, వర్షాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరో అల్పపీడనం సూచన…
అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు–భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.