తెలంగాణ, ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Telangana, Andhra Pradesh Weather update: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. ఆగస్టు 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ఇరు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం
Telangana, Andhra Pradesh Weather update: తెలుగు రాష్ట్రాలకు ఏమైంది..? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగ బట్టాడా..? గత 15 రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ వానలు అంటే భయపడాల్సి వస్తోంది. మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణకు మరోసారి వర్షాల ముప్పు
తెలంగాణలో గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శనివారం తాత్కాలిక విరామం లభించింది. అయితే ఈ ఉపశమనం ఎక్కువ కాలం నిలవదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఆగస్టు 25న ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారుల అంచనా.
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. నేటి వాతావరణం ప్రకారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక వచ్చే 24 గంటల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇది కాకుండా..
ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విషయానికి వస్తే.. నేడు (ఆదివారం) కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఆగస్టు 25 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వర్షాలు మళ్లీ విస్తరించే అవకాశముందని చెప్పారు. మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
పోటెత్తుతోన్న వరద
మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడం వల్ల ప్రాజెక్ట్ లకు వరద పోటెత్తుతోంది. ప్రధానంగా నాగార్జున సాగర్ జలాశయంలోని 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 583 అడుగులకు చేరుకుంది.
కాటన్ బ్యారేజి వద్ద శనివారం రాత్రి 8 గంటలకు ఇన్-ఔట్ ఫ్లో 9.57 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా నది ప్రవాహం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరించబడిందని అధికారులు వెల్లడించారు.