తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా .. ఈ ప్రాంతాలకు పొంచివున్న భారీ వర్షగండం
IMD Rain Alert : ఇవాళ వాయుగుండం… రేపు తీవ్ర వాయుగుండం… ఎల్లుండి తుపాను… ఇలా బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిస్థిలతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇకపై వానలే వానలు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఇకపై భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో కుండపోత వానలు కురుస్తుండగా తెలంగాణలోనూ అక్కడక్కడ భారీ వానలు పడతున్నాయి.... వీటితీవ్రత వచ్చే వారంరోజులు మరింత పెరుగుతుందని ప్రకటించారు. బంగాళాఖాతంలో వర్షాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో తుపాను
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైన ఉందని ఏప విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శనివారం (అక్టోబర్ 25కు) వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని హెచ్చరించింది. ఆదివారం తీవ్ర వాయుగుండం, సోమవారానికి తుపానుగా మారుతుందని... వీటి ప్రభావంతో ఈ నాలుగైదు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.
ఈ ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో నేడు (అక్టోబర్ 25) కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించాయి. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసిన విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రభుత్వం అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుపాను ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై ఎక్కువగా ఉండనుంది… ఈ నేపథ్యంలో ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యాయి. అధికారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని... ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు అమలుచేయాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉంటుంది... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణనష్టం లేకుండా చూడాలని... ఆస్తినష్టం కూడా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసర సమయంలో సహాయం కోసం SDRF, NDRF బృందాలను సిద్దంగా ఉంచాలని.. ప్రజలు విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 కు సంప్రందించి సహాయం పొందవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండకూడదు.
- భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి. ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దు.
- తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదు.
- తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి వరద పరిస్థితులు ఏర్పడితే వెంటనే లోతట్టుప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేస్తుంది… అక్కడ తలదాచుకోవాలి.
- వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహించే ప్రవాహాల వద్దకు వెళ్లరాదు... రోడ్లు, వంతెనలపైకి చేరిన నీటిప్రవాహాలను దాటే ప్రయత్నం చేయరాదు.
- రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నేడు తెలంగాణలో వర్షాలు కురిసే జిల్లాలివే
తెలంగాణలో కూడా ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం, రాబోయే వాయుగుండం, తుపానుల ప్రభావంతో వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ (అక్టోబర్ 25)జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఇక కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిసేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్,వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.