CBN: చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు.. ఎవరీ శంకరయ్య.? అసలేంటీ కథ.?
CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చర్చనీయాంశమైంది. ఈ కేసులో తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ సీఐ జె. శంకరయ్య నేరుగా లీగల్ నోటీసులు పంపడం హాట్ టాపిక్‌గా మారింది.

వివేకా హత్య కేసు, ఆరోపణల నేపథ్యం
2019 మార్చిలో కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ జె. శంకరయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేశారు. ఘటన అనంతరం నిందితులు ఆధారాలు తారుమారు చేయగా, ఆయన సమక్షంలోనే రక్తపు మరకలు తుడిచేశారని, కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా సాగిందని చంద్రబాబు అప్పట్లో పలు వేదికలపై ఆరోపించారు.
లీగల్ నోటీసులో డిమాండ్లు
ఈ ఆరోపణలు తన ప్రతిష్ఠను దెబ్బతీశాయని శంకరయ్య వాదిస్తున్నారు. ఆయన న్యాయవాది జి. ధరణేశ్వరరెడ్డి ద్వారా సెప్టెంబర్ 18న చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అందులో అసెంబ్లీ వేదికపైనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, తన పరువు నష్టం కోసం రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని కోరారు. ఈ నోటీసులు సెప్టెంబర్ 23న వెలుగులోకి వచ్చాయి.
సస్పెన్షన్, సీబీఐ విచారణలో శంకరయ్య పాత్ర
హత్య ఘటన సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో 2019లోనే ఆయనపై సస్పెన్షన్ విధించారు. తర్వాత సీబీఐ దర్యాప్తులో శంకరయ్య మొదట తనను కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెదిరించారని చెప్పినా, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేసే దశలో వెనక్కి తగ్గారు. ఆ తరువాత 2021 అక్టోబరులో వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
ప్రస్తుతం శంకరయ్య ఏం చేస్తున్నారు.?
ప్రస్తుతం శంకరయ్య కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలోనే ఆయన నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది. ముఖ్యంగా ఐదేళ్లకుపైగా పాత ఆరోపణలపై ఇప్పుడు నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది.
రాజకీయ వర్గాల్లో చర్చ
ఒకవైపు వివేకా హత్య కేసు దర్యాప్తు దాదాపు పూర్తైందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేయగా, మరోవైపు ఆ కేసులో ప్రధానంగా నిలిచిన మాజీ సీఐ శంకరయ్య ఈ విధంగా చర్యలు తీసుకోవడం కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆయన డిమాండ్లు, ఆరోపణలు, నోటీసుల వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.