Weather: ఓవైపు ఎండ మరో వైపు వాన.. ఏపీలో విచిత్ర వాతావరణం
ఫిబ్రవరి చివరి నాటికే ఎండలు దంచికొడుతున్నాయి. శివరాత్రి నాటికి చలి తీవ్రత తగ్గి ఎండలు దంచికొడతాయని చెబుతుంటారు. దీనికి అనుగుణంగానే భానుడి ప్రతాపం మొదలైంది. అయితే ఓవైపు ఎండలు దంచికొడుతుండగానే మరోవైపు కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన కూడా ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. మరి గురువారం వాతావరణం ఎలా ఉండనుంది? ఇప్పుడు తెలుసుకుందాం..

Weather update
ఓవైపు ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ఎక్కువుతోంది. అయితే మరోవైపు ఉదయం వాతావరణం చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం కాగానే ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలకపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దిగువ ట్రోపో ఆవరణంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్, సీమలో ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కారణంగా ఉత్తర కోస్తాలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉండనుంది. కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ కోస్తాలో ఈరోజు కొన్ని చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో గురువారం పొడివాతావరణం ఉండే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం రాయలసీమలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరికొన్నిచోట్ల గరిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ విషయానికొస్తే..
ఇక తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి వరకు వాతావరణంలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవని అయితే ఆ తర్వాత ఎండ తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే..
ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు దేశంలోనే అత్యధికంగా ఎక్కువ రోజులు ఆంధప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా, కేరళ, కర్ణాటకల్లో నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో ముందుగానే వేసవి ప్రారంభమైంది. అయితే ప్రతీ ఏటా ఇలాగే జరిగినా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. కొన్ని చోట్ల గాలిలో తేమ భారీగా తగ్గుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మరి రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం ఎలాగా ఉంటుందో చూడాలి.