- Home
- Andhra Pradesh
- Bhogapuram Airport : ఉత్తరాంధ్రుల కల సాకారం ... భోగాపురం ఎయిర్ పోర్ట్ లో విమానం చక్కర్లు
Bhogapuram Airport : ఉత్తరాంధ్రుల కల సాకారం ... భోగాపురం ఎయిర్ పోర్ట్ లో విమానం చక్కర్లు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయంపై కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ విమానాశ్రయంలో ఓ ప్లేన్ చక్కర్లుకొడుతున్న వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదికన పంచుకున్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ లో విమానం
Bhogapuram Airport : ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జిఎంఆర్ ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది.
ఇప్పటికే ఈ విమానాశ్రయ నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయి... ప్రస్తుతం విమానాల రాకపోకలకు సంబంధించిన టెక్నికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ విమానం భోగాపురం విమానాశ్రయంలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఎక్స్ వేదికన పంచుకున్న కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై విమానయాన శాఖ మంత్రి కీలక అప్ డేట్
భోగాపురం విమానాశ్రయంపై విమానం ఎగురుతున్న వీడియోను రామ్మోహన్ నాయుడు షేర్ చేశారు. ''భోగాపురం అతర్జాతీయ విమానాశ్రయ (విశాఖపట్నం) నిర్మాణం కీలక దశకు చేరుకుంది. దీన్ని మీతో పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నా. విమాన రాకపోకలకు సంబంధించిన AAI పరీక్షలు విజయవంతంగా సాగాయి... ఇందుకోసం బెంచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 360 భోగాపురం చేరుకుంది. కీలకమైన సేఫ్టీ నావిగేషన్ వ్యవస్థలు ILS, DVOR, PAPI టెస్ట్ చేశారు. ఇవి విమానం ల్యాండింగ్, ఆపరేషన్స్ లో చాలా ముఖ్యమైనవి'' అని తెలిపారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ను ఎప్పుడు ప్రారంభించనున్నారంటే...
''AAI అధికారులు, INS Dega తో పాటు జిల్లా అధికారుల సహకారంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి... మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తిచేస్తాం. 2026 జూన్ నాటికి అంటే సరిగ్గా మరో ఏడాదిలో దీని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తాం'' అని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
''ఈ వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కనెక్టివిటీనీ కల్పించడమే కాదు మరెన్నో అవకాశాలు ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు, పెట్టుబడులు, టూరిజంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది'' అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పేర్కొన్నారు.
Proud to share a major milestone in the development of Bhogapuram International Airport ,Visakhapatnam. A successful calibration exercise was carried out by AAI using the Benchcraft King Air 360, ensuring precision and safety of key navigational systems- ILS, DVOR, and PAPI.… pic.twitter.com/Y5kWY6i4G9
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 24, 2025
భోగాపురం విమానాశ్రయం ప్రత్యేకతలు
భోగాపురం విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ రూ.4,592 కోట్లతో నిర్మిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, అద్బుత సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ కు అనుకూలంగా ఏకంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రెండు రన్ వే లను నిర్మించారు. ఇప్పటికే విమాన రాకపోకలకు సంబంధించిన టెస్టింగ్ పనులు సాగుతున్నాయి.
భొగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయంలో రాకపోకలకు నిలిచిపోనున్నాయి. డొమెస్టిక్ తో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా అక్కడినుండే నడుస్తాయి. పాత విమానాశ్రయాన్ని ఇండియన్ నేవీ అప్పగించనున్నారు... ప్రధాని, ఇతర ప్రముఖుల విమానాలను మాత్రమే ఇక్కడ ల్యాండిగ్ అనుమతించనున్నారు.
భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు లాభాలివే...
ఈ భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సరిహద్దులోని ఒడిషా ప్రజలకు కూడా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుంది.
విశాఖపట్నం నుండి 44 కి.మీ, విజయనగరం నుండి 23 కి.మీ, శ్రీకాకుళం నుండి 64 కి.మీ దూరంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని... రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.