వీడెవడండీ బాబూ... బస్సులో దొంగతనం కాదు బస్సునే దొంగిలించాడు
బస్సులో దొంగతనం… ఇది కామన్ గా వినిపించే మాటే. కానీ బస్సునే దొంగలించడం.. ఇది కాస్త వైరిటీగా ఉంది. ఇలాంటి ఘరానా దొంగతనమే నెల్లూరు జిల్లాలో జరిగింది.

ఏకంగా బస్సునే దొంగిలించిన ప్రబుద్దుడు...
APSRTC Bus Robbery : సాధారణంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు దొంగలు. రాత్రుళ్లు ఇళ్లలోకి చొరబడి దొపిడీకి పాల్పడుతుంటారు... కొందరు పట్టపగలే జేబులోని పర్సులు, మెడలోని బంగారు ఆభరణాలు కాజేస్తుంటారు. బైక్, కారు వంటి వాహనాలు దొంగిలించేవారు ఉన్నారు. ఇలాంటి దొంగతనాల గురించి నిత్యం వింటుంటాం... కానీ కొందరు చాలా విచిత్రమైన దొంగతనాలకు పాల్పడుతుంటారు. అలాంటిదే గత రాత్రి నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
అర్ధరాత్రి ఆర్టిసి బస్ దొంగతనం
బస్సుల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ బస్సులే దొంగతనానికి గురవడం చాలా అరుదు. ఇలా నెల్లూరులో ఆర్టిసి బస్సును దొంగిలించి అడ్డంగా బుక్కయ్యాడో ఘరానాా దొంగ.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఆర్టిసి ప్రజల సౌకర్యార్థం బస్సు సర్వీసులను నడిపిస్తోంది. ఇలా ఆత్మకూరు డిపోనుండి కూడా వివిధ ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి... ఇందులో ఎక్స్ ప్రెస్ తో పాటు పల్లె వెలుగు సర్వీసులు కూడా ఉన్నాయి. అయితే మంగళవారం ఆత్మకూరు నుండి ఓ పల్లె వెలుగు బస్సు ప్రయాణికులతో నెల్లూరు బయలుదేరింది... రాత్రికి గమ్యస్థానానికి చేరుకుంది.
రాత్రికి రాత్రే బస్సు మాయం
ప్రయాణికులు దించేశాక బస్సును బస్టాండ్ లో పార్క్ చేసి డ్రైవర్, కండక్టర్ రెస్ట్ రూంలో పడుకున్నారు. ఉదయమే బస్సు తిరిగి ఆత్మకూరుకు బయలుదేరాల్సి ఉంది. అయితే ఇవాళ(బుధవారం) తెల్లవారుజామన నిద్రలేచిన బస్సు డ్రైవర్, కండక్టర్ కు షాక్ తగిలింది... పార్క్ చేసినచోట బస్సు కనిపించలేదు. దీంతో వెంటనే వీళ్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు... వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్సు దొరికిందిలా...
బస్సు దొంగతనానికి గురయినట్లు నిర్దారణ కావడంతో పోలీసులు రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లు, బార్డర్ చెక్ పోస్టులకు సమాచారం అందించారు. ఆర్టిసి బస్సు నెంబర్ ను ఆధారంగా నెల్లూరు పాలెం సర్కిల్ వద్ద బస్సును గుర్తించారు. వెంటనే ఆపి దొంగను అదుపులోకి తీసుకున్నారు.
దొంగిలించింది ఎవరో తెలుసా?
ఈ ఆర్టిసి బస్సు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి విడవలూరు మండలం కంచర్లు గ్రామానికి చెందిన కృష్ణగా గుర్తించారు. అతడిని అదుపులోకి అరెస్ట్ చేసి బస్సును ఆర్టిసి అధికారులకు అప్పగించారు పోలీసులు. ఏకంగా ఆర్టిసి బస్సునే దొంగిలించిన ఘటనపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ''ఆర్టిసి బస్సులో దొంగతనాల గురించి చూశాం... కానీ ఆర్టిసి బస్సునే దొంగిలించడం ఏంట్రా బాబు' అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.