- Home
- Andhra Pradesh
- AP Cabinet: నేతన్నలకు రూ. 25 వేలు, కొత్త యూనివర్సిటీలు, పుష్కరాలకు కోట్ల నిధులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet: నేతన్నలకు రూ. 25 వేలు, కొత్త యూనివర్సిటీలు, పుష్కరాలకు కోట్ల నిధులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నేతన్నల సేవలో పథకానికి ఆమోదం, కొత్త ప్రైవేట్ వర్సిటీలు, గోదావరి పుష్కరాల నిధులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డిగ్రీ విద్యార్థులు, చేనేతలకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రజా సంక్షేమం, విద్యా రంగ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
చేనేత కార్మికులకు 'నేతన్నల సేవలో' పథకం ద్వారా రూ. 25,000 సాయం
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు "నేతన్నల సేవలో" అనే నూతన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వయస్సుతో నిమిత్తం లేకుండా, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 25,000 ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ నిధులతో కార్మికులు రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు చేసుకోవడంతో పాటు పరికరాలను ఆధునీకరించుకోవడానికి వీలవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 51,952 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరనుండగా, ప్రభుత్వం దీనికోసం ఏటా రూ. 129.88 కోట్లు వ్యయం చేయనుంది. ఇది కాకుండా, 50 ఏళ్లు దాటిన 93,000 మంది చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పింఛను కింద నెలకు రూ. 4,000 చొప్పున ఏటా రూ. 446.40 కోట్లు అందిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే చేనేత, పవర్ లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ కోసం మరో రూ. 150 కోట్లు కేటాయించారు.
బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల
దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 30 మంది ప్రవేశ సామర్థ్యంతో ప్రారంభమయ్యే ఈ కళాశాలలో బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తారు.
బాపట్లలోని వినికిడి లోపం ఉన్న విద్యార్థుల పాఠశాల, జూనియర్ కళాశాలలు 1999 నుండి వరుసగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ వస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 450 మందికి పైగా వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఇంటర్ పూర్తీ చేస్తున్నప్పటికీ, వారి కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది దివ్యాంగుల హక్కుల చట్టం-2016 'ఇంద్రధనుస్సు' కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది.
ప్రైవేట్ వర్సిటీలు, విద్యా రంగానికి పెద్దపీట
రాష్ట్రంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు 'ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం-2016'కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
• విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌ను 'బ్రౌన్‌ఫీల్డ్' కేటగిరీ కింద ప్రైవేట్ విమెన్స్ యూనివర్సిటీగా మారుస్తున్నారు. ఇది రాష్ట్రంలోనే మొదటి ప్రైవేట్ మహిళా వర్సిటీ కానుంది.
• చలపతి యూనివర్సిటీ: గుంటూరు జిల్లా లాంలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని వర్సిటీగా మారుస్తున్నారు.
• ఈ ప్రైవేట్ వర్సిటీలలో 35% సీట్లను ప్రభుత్వ కోటా కింద నియంత్రిత రాయితీ ఫీజులతో భర్తీ చేయడం వల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది.
అలాగే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని SKIT ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాన్ని JNTU-అనంతపురంకు 11 ఏళ్ల లీజుకు బదిలీ చేసే ఒప్పందంపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
గోదావరి పుష్కరాలు-2027, అగ్నిమాపక సేవల ఆధునీకరణ
2027 జూన్, జూలైలలో జరగనున్న గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, ఏడు జిల్లాల పరిధిలోని ఘాట్లు, ఆలయాల వద్ద భద్రత, బందోబస్తు, కమాండ్ కంట్రోల్ రూముల ఏర్పాటుకు రూ. 50 కోట్లు మంజూరు చేశారు.
పరిశ్రమలు, ఇంధన, సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం
1. BHAVYA పథకం: 'భారత్ ఔద్యోగిక వికాస్ యోజన' కింద తిరుపతిలో స్పేస్ సిటీ (1,000 ఎకరాలు), కర్నూలులో డ్రోన్ సిటీ (500 ఎకరాలు), శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడులో ఏరోస్పేస్ పార్క్, మాకవరపాలెంలో ఆగార్నిక్ ఫుడ్ పార్క్, మాచర్లలో జౌళి పార్క్, ప్రకాశంలో పునరుత్పాదక ఇంధన పార్కులను మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేస్తారు. APIICకి వీటిపై స్థానిక సంస్థల అధికారాలను కట్టబెట్టారు.
2. సాగునీటి ప్రాజెక్టులు: వంశధార స్టేజ్-II కింద నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ. 641.10 కోట్లు, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని HNSS ఫేజ్-II కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులకు (ప్యాకేజీ-5) రూ. 312 కోట్ల సవరించిన నిధులకు ఆమోదం లభించింది.
3. పుట్టపర్తి ఏరోస్పేస్ కేంద్రం: SSS ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విమానయాన, ఏరోస్పేస్ మౌలిక వసతుల కేంద్రం ఏర్పాటుకు వీలుగా పుట్టపర్తి వద్ద ఉన్న 76.13 ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించారు.
4. ఇతర భూ కేటాయింపులు: నంద్యాల జిల్లాలో AM గ్రీన్ ఎనర్జీ సోలార్-విండ్ ప్రాజెక్టుకు భూములు, కుప్పంలో బయో గ్యాస్ ప్లాంట్ కోసం శ్రేష్ఠ రెన్యూవబుల్స్‌కు లీజు, అలాగే విశాఖపట్నంలో AIG హాస్పిటల్స్ నర్సింగ్ కళాశాల, హాస్టళ్ల నిర్మాణానికి 2.16 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపారు.

