- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: రూ. లక్షల కోట్ల పెట్టుబడులు.. ఏపీలోని ఈ నగరం మరో సిలికాన్ వ్యాలీ కావడం ఖాయం
Andhra Pradesh: రూ. లక్షల కోట్ల పెట్టుబడులు.. ఏపీలోని ఈ నగరం మరో సిలికాన్ వ్యాలీ కావడం ఖాయం
Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సాగర నగరం విశాఖకు లక్షల కోట్ల పెట్టుబడులు క్యూ కడుతున్నాయి.

గూగుల్ భారీ డేటా సెంటర్
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం మరో మలుపు తిరగబోతోంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 480 ఎకరాల విస్తీర్ణంలో రూ. 87,520 కోట్లతో భారీ డేటా సెంటర్‌ను స్థాపించబోతోంది. ఇది పూర్తిగా ఈక్విటీ ఫండింగ్‌తో వచ్చే ప్రాజెక్ట్. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖను AI ఆధారిత స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ప్రభుత్వం, గూగుల్ కలిసి విశాఖ, అనకాపల్లిలో మొత్తం 639 ఎకరాలపై మూడు డేటా క్యాంపస్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మొత్తం పెట్టుబడి $10 బిలియన్ (సుమారు రూ.8,730 కోట్లు). ఈ ప్రాజెక్ట్ 2028-30 మధ్య పూర్తవనుంది.
మూడు ప్రాంతాల్లో గూగుల్ క్యాంపస్‌లు
గూగుల్ డేటా సెంటర్ క్లస్టర్‌లో భాగంగా మూడు ప్రాంతాలు ఎంపికయ్యాయి
* తర్లువాడ (308 ఎకరాలు) – భోగాపురం ఎయిర్‌పోర్ట్ రోడ్డుకు సమీపంలో
* అడవివరం (150 ఎకరాలు) – సింహాచలం పరిసరాల్లో
* రంభిల్లి (181 ఎకరాలు) – అనకాపల్లి జిల్లాలో
ఈ ప్రాజెక్ట్ కోసం రోజుకు 2500 మెగావాట్ల విద్యుత్, లక్షల గ్యాలన్ల నీటి సరఫరా, అలాగే సముద్ర అడుగున సబ్‌మరైన్ కేబుల్ లైన్ల అవసరం ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలవనుంది.
మెటా, టీసీఎస్, టీవీఎస్ – విశాఖలో పెట్టుబడి వర్షం
గూగుల్‌తో పాటు ఇతర టెక్ దిగ్గజాలు కూడా విశాఖలో అడుగుపెడుతున్నాయి.
* మెటా (Facebook) – ప్రపంచాన్ని కలిపే ‘వాటర్వర్త్’ పేరుతో 50,000 కి.మీ. పొడవైన సముద్ర అడుగు కేబుల్ ప్రాజెక్ట్‌లో విశాఖను ల్యాండింగ్ సైట్‌గా ఎంపిక చేసింది. ఇది భారత్, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలను కలుపుతుంది.
* టీసీఎస్ (TCS) – 1 గిగావాట్టు సామర్థ్యంతో కొత్త డేటా సెంటర్‌ను విశాఖలో స్థాపించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
* టీవీఎస్ ఇండస్ట్రియల్ & లాజిస్టిక్స్ పార్క్ – 17 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్లతో గ్రేడ్-A లాజిస్టిక్స్ పార్క్‌ను నిర్మించనుంది. ఈ పెట్టుబడులు కలిపి విశాఖను భారత టెక్ క్యాపిటల్‌గా మార్చనున్నాయి.
ఇన్నేవేషన్ నగరంగా విశాఖ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను “విశాఖను టెక్నాలజీ, ఇన్నోవేషన్ నగరంగా తీర్చిదిద్దే అడుగులు”గా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, “TCS డేటా సెంటర్, మెటా కేబుల్, గూగుల్ క్యాంపస్‌లతో విశాఖ ప్రపంచ డిజిటల్ హబ్‌గా అవతరించనుంది” అన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 14న న్యూఢిల్లీకి వెళ్లి గూగుల్ అధికారులతో తుది ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆయన మాట్లాడుతూ, “విశాఖను భారతదేశం AI Cityగా నిలబెట్టే అవకాశమిది” అన్నారు.
స్మార్ట్ సిటీ నుంచి గ్లోబల్ హబ్ వరకు
విశాఖకు క్యూకడుతోన్న ఈ పెట్టుబడులు రాష్ట్రానికి వేలాది ఉద్యోగాలు, అంతర్జాతీయ గుర్తింపు, ఆధునిక మౌలిక వసతులను తీసుకురానున్నాయి. డేటా సెంటర్‌లు, సబ్‌మరైన్ కేబుల్‌లు, ఫైబర్ నెట్‌వర్క్‌లు – ఇవన్నీ కలిపి విశాఖను ఆసియా అతిపెద్ద డేటా హబ్‌గా మార్చే అవకాశం ఉంది. వచ్చే 5 ఏళ్లలో విశాఖ టెక్ హబ్‌గా మారనుందని, మరో సిలికాన్ వ్యాలీ కావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.