- Home
- Andhra Pradesh
- ఆంధ్రప్రదేశ్‌లో మరో సైబరాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో మరో సైబరాబాద్.. బే-టెక్ సిటీ పేరుతో నిర్మాణం. చంద్రబాబు కీలక నిర్ణయం
Andhra pradesh: విశాఖ, అమరావతి, తిరుపతిని ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖలో సైబరాబాద్ తరహాలో బే-టెక్ సిటీ, తిరుపతిలో సెమీ కండక్టర్ డిజైన్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సైబరాబాద్ తరహాలో విశాఖ బే-టెక్ సిటీ
హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన తరహాలో విశాఖపట్నానికి అనుబంధంగా మరో నగరాన్ని నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలో యాంకర్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతానికి ‘విశాఖ బే-టెక్ సిటీ’గా పేరు ఖరారు చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. వీఈఆర్ స్టీరింగ్ కమిటీలో నగర మేయర్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక ప్రాంతంలో గుర్తించిన 167 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 64 అమలులోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. విశాఖకు ఇరువైపులా ఉన్న విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏపీఐఐసీ సహకారంతో భూములను సమీకరించాలని ఆదేశించారు. విశాఖలో ఏడాదిలోగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, పోర్టుల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాలను విస్తరించాలని పేర్కొన్నారు. ప్రతి పారిశ్రామిక ప్రాంతం పక్కనే ఉద్యోగులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో టౌన్‌షిప్‌లు నిర్మించాలని సూచించారు.
మూడు ఆర్థిక ప్రాంతాలే రాష్ట్రాభివృద్ధికి మార్గదర్శకాలు
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి ప్రణాళికలను రాష్ట్ర సమగ్ర పురోగతికి కీలకమైన బ్లూప్రింట్‌గా చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన పెట్టుబడులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా వాస్తవ ప్రాజెక్టులుగా మారాలని స్పష్టం చేశారు.
పరిశ్రమల స్థాపనతోనే అభివృద్ధి పూర్తికాదని, వాటి ద్వారా ప్రజలకు మెరుగైన ఆదాయం, ఉపాధి, జీవన ప్రమాణాలు అందాలని సీఎం పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించి తలసరి ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మూడు రీజియన్లలో చేపడుతున్న పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిటీ ఎకనమిక్ రీజియన్ పథకం కింద 60 ప్రాజెక్టుల కోసం రూ.9,180 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
గ్లోబల్ సెమీ కండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో సెమీ కండక్టర్ డిజైన్ రంగానికి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. ఎలక్ట్రానిక్స్, అంతరిక్ష పరిశోధన, రోబోటిక్స్, డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు అవసరమైన డిజైన్, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి పారిశ్రామిక క్లస్టర్లను మరింత బలోపేతం చేయడంతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహం అందించాలన్నారు. అరుదైన ఖనిజాల వ్యర్థాల నుంచి విలువైన పదార్థాలను వేరు చేసి ఇతర అవసరాలకు వినియోగించే సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ, ఉద్యాన పంటలు, ఖనిజ సంపద ఆధారంగా తిరుపతి ప్రాంతంలో కొత్త పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ ఎకనమిక్ రీజియన్‌కు సంబంధించి మొత్తం రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, అందులో రూ.5.70 లక్షల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించినవని తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం వచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని, మూడేళ్లలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 16 పట్టణాలను పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అమరావతి ప్రాంతానికి పోర్టుల కనెక్టివిటీ.. క్వాంటమ్ టెక్నాలజీపై దృష్టి
అమరావతి ఎకనమిక్ రీజియన్‌ను పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. ఈ ప్రాంతంలో ఆక్వా, కోకో, పామాయిల్ రంగాలు ఆర్థిక వృద్ధికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ రీజియన్ పరిధిలో రూ.4.65 లక్షల కోట్ల విలువైన 48 ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తే అమరావతి ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తయారీ రంగానికి కూడా అమరావతిని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్ల నిర్మాణాలు ఈ ప్రాంత భవిష్యత్తు అభివృద్ధికి కీలకంగా మారతాయని సీఎం పేర్కొన్నారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానానికి తోడ్పడేలా ప్రముఖ విద్యాసంస్థలను నాలెడ్జ్ పార్ట్నర్లుగా నియమించాలని అధికారులకు సూచించారు.
పర్యాటక రంగానికి కొత్త ఊపు.. బీచ్, ఆధ్యాత్మిక సర్క్యూట్ల అభివృద్ధి
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి సందర్శకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని చంద్రబాబు ఆదేశించారు. అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రాబోయే సీఐఐ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఈ ప్రాంతాలకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
రాష్ట్ర తీరప్రాంతాల్లో బీచ్ రిసార్టులు, ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పారు. సూర్యలంక, చినగంజాం, ఓడరేవు, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సూర్యలంక, గండికోట ప్రాంతాలకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని సూచించారు.
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా విస్తృతంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్నారు. నాగార్జునకొండ, అమరావతి ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, పోర్టులు, పర్యాటక రంగాలను అనుసంధానించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రణాళికలను వేగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.














