విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలు 10 శాతం పెంచుతూ నిర్ణయం
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఈ ఏడాదే అమలు.. రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలు
రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెంపును ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. డైట్ ఛార్జీల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయాలని అధికారులు సూచించినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో రాజీ పడకూడదని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే పెరిగిన డైట్ ఛార్జీలను అమల్లోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
హాస్టళ్లకు బదులుగా ఆధునిక గురుకులాలపై దృష్టి
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లను క్రమంగా ఆధునిక గురుకులాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు పోటీగా నిలిచేలా మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన విద్య అందించే రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గురుకులాల్లో బయోడైవర్సిటీ పార్కులు, పర్యావరణ హిత విధానాలు, నెట్ జీరో కాన్సెప్ట్ వంటి అంశాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత, పరిశుభ్రమైన వాతావరణం కల్పించే అవకాశం ఉంటుంది.
ప్రతిభావంతుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు
సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే మెరిట్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, సివిల్ సర్వీసులు వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా నిపుణులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
విద్యార్థుల ఆరోగ్యం, పూర్వ విద్యార్థుల సహకారం, పేదల జీవనోపాధిపై దృష్టి
హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హోమ్‌సిక్ సమస్యతో బాధపడే విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఇప్పటికే అమలు చేస్తున్న స్మార్ట్ కార్డ్ ఆధారిత టెలిఫోన్ వ్యవస్థను మరింత సమర్థంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, వారు విద్య, వైద్యం, మార్గదర్శకత్వం వంటి రంగాల్లో స్వచ్ఛందంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులు కూడా హాస్టళ్లను దత్తత తీసుకునే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.
సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయం, ఉద్యానవనం, పాడి పరిశ్రమ, స్వయం ఉపాధి పథకాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పీ4 (P4) కార్యక్రమంతో అనుసంధానం చేసి బడుగు బలహీన వర్గాల కుటుంబాల ఆదాయాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా మరింత సమర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.

