- Home
- Andhra Pradesh
- Free Bus: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి? ఏ బస్సుల్లో ఉచితం? పూర్తి వివరాలు ఇవిగో
Free Bus: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి? ఏ బస్సుల్లో ఉచితం? పూర్తి వివరాలు ఇవిగో
AP Free Bus Travel Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం తీసుకొచ్చింది. ఫ్రీ బస్సు జర్నీ అందిస్తున్న స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ శక్తి పథకం : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతోంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగస్టు 4న ప్రకటించిన విధంగా, ఈ పథకం కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలు చేస్తున్నారు.
ఏపీ ఉచిత బస్సు ప్రయాణం ఏ బస్సుల్లో ఉంటుంది? గుర్తింపు కార్డులు ఏవి ఉండాలి?
స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. వాటిలో:
- పల్లె వెలుగు
- అల్ట్రా పల్లె వెలుగు
- సిటీ ఆర్డినరీ
- మెట్రో ఎక్స్‌ప్రెస్
- ఎక్స్‌ప్రెస్
అయితే, తిరుమల-తిరుపతి మధ్య సప్తగిరి బస్సులు, నాన్ స్టాప్ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, సూపర్ లగ్జరీ, ఏసీ, స్టార్ లైనర్, ఆల్ట్రా డీలక్స్ బస్సులు ఈ పథకం నుంచి మినహాయించారు. అలాగే, ఇతర రాష్ట్రాల మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం ఉండదు.
మహిళలు స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. జీరో ఫేర్ టికెట్ ద్వారా ఉచిత ప్రయాణం అందించనున్నారు.
స్త్రీ శక్తి పథకం నిబంధనలు, భద్రతా ఏర్పాట్లు
రద్దీ పెరగకుండా ప్రభుత్వం అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, మహిళా కండక్టర్ల కోసం బాడీ వేర్ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. బస్టాండ్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచే చర్యలు చేపట్టారు.
కండక్టర్లు జీరో టికెట్ల నిర్వహణలో శిక్షణ పొందారు. ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి జరిగిందో జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది, దీని ద్వారా ఆర్థికంగా ప్రభుత్వం APSRTC కి తిరిగి చెల్లిస్తుంది.
స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ప్రయోజనాలు
ఈ పథకం ద్వారా మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార ప్రయాణాలకు సౌకర్యం పొందుతారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. యువత, బాలికలు చదువుల కోసం స్కూళ్లు, కాలేజీలకు వెళ్ళడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది. ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవం, ఆర్థిక భారం తగ్గుతుంది. స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు సహకరిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 మధ్యాహ్నం ఉచిత బస్సు పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాంకేతిక సౌకర్యాల్ని సమన్వయం చేసి అమలు చేస్తారు. బస్సుల సంఖ్యను పెంచడం, కొత్త ఎలక్ట్రిక్ బస్సులను చేర్చడం వంటి చర్యలు ఇప్పటికే సిద్ధం చేశారు. మొదటి దశలో 750 బస్సులు అందుబాటులోకి వస్తాయి.