- Home
- Andhra Pradesh
- Aadabidda Nidhi : నెలకు రూ.1500, ఏడాదికి రూ.18,000 ... తెలుగు మహిళలకు జీవితాంతం ప్రభుత్వ ఆర్థికసాయం
Aadabidda Nidhi : నెలకు రూ.1500, ఏడాదికి రూ.18,000 ... తెలుగు మహిళలకు జీవితాంతం ప్రభుత్వ ఆర్థికసాయం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగింటి ఆడబిడ్డలకు జీవితాంతం ఆర్థికసాయం అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఇంకొక్క పథకం అమలయితే ఇక మహిళలకు బ్రతికున్నన్ని రోజులు డబ్బులే డబ్బులు. ఇంతకూ ఈ పథకం ఏంటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

తెలుగు మహిళలకు ఆర్థిక సాయం
TDP Super Six Schemes : ఆంధ్ర ప్రదేశ్ లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం పాలనపైనే కాదు ఎన్నికల హామీల అమలుపైనా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తోంది... ఇప్పటికే యువతకు ఉద్యోగాల హామీలో భాగంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్, పిల్లల చదువులకు ఆర్థికసాయం హామీలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. వచ్చే నెలనుండి మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా అమలుచేయనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఆగస్ట్ 15 అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అవుతుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సంబంధిత అధికారులతో పలుమార్లు సమావేశమైన ముఖ్యమంత్రి ఉచిత ప్రయాణ పథకం గురించి చర్చించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. తెలంగాణ, కర్ణాటకలో మాదికిగానే ఏపీ మహిళలు కూడా ఆగస్ట్ 15 నుండి జీరో టికెట్ పై ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించనున్నారు.
సూపర్ సిక్స్ హామీల్లో ఇదొక్కటే మిగిలిపోయింది...
ఇలా సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటిగా అమలుచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఓ పథకం మాత్రం పెద్ద సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతు మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం పించన్లు ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు నెలనెలా ఆర్థికసాయం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 18 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించనున్నట్లు హామీ ఇచ్చింది. అంటే 60 ఏళ్లవరకు ఈ ఆర్థికసాయం, తర్వాత పించను... ఇలా మహిళలకు జీవితాంతం ప్రభుత్వం నుండి డబ్బులు వస్తాయన్నమాట.
మహిళలకు ఆర్థికసాయం పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర కామెంట్స్ :
తాజాగా మహిళలకు ఆర్థిక సాయం పథకంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వ పథకాల గురించి ఇంటింటికి వివరించే కార్యక్రమం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు అచ్చెన్నాయుడు... ఈ సందర్భంగానే సూపర్ సిక్స్ లో ఇక మిగిలింది మహిళలకు ఆర్థిక సాయం చేసే ‘ఆడబిడ్డకు నిధి’ పథకం ఒక్కటేనని అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆర్థికంగా చాలా భారం... ఈ పథకం అమలు చేయాలంటూ ఆంధ్రాను అమ్మాల్సి వస్తుందంటూ అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేాశారు.
అయితే ఎంత భారమైనా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని... ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ఎలా అమలుచేయాలి? నిధులను ఎలా సమీకరించాలి? అనేదానిపై ప్రభుత్వ కసరత్తు చేస్తోందన్నారు. ఈ పథకంపై కూడా త్వరలోనే సీఎం నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు 'ఆడబిడ్డకు నిధి పథకం' పై కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ పథకం అమలుపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రను అమ్మాలని స్వయంగా మంత్రి అన్నారంటే… అమలుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను ఓసారి పరిశీలిద్దాం.
'ఆడబిడ్డకు నిధి' పథకానికి బడ్జెట్ కేటాయింపులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు నెలనెలా ఆర్థికసాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉంది.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని బడ్జెట్ లో నిధులను కేటాయించడంబట్టే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఎప్పుడు అమలుచేస్తారు? ఇన్ని నిధులను ఎక్కడినుండి సమకూర్చుకుంటారు? అనేదే ప్రశ్న.
రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకం కోసం రూ.3,300 కోట్లు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. దీన్నిబట్టే ఈ పథకాన్ని పక్కనబెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. కానీ ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయకపోవడం, అచ్చెన్నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ అనుమానాలకు తావిస్తున్నాయి. మరి ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం 'ఆడబిడ్డలకు నిధి' పథకంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
ఆడబిడ్డకు నిధి పథకంతో మహిళలకు ఎంత లాభమో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ లోని 18 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు మహిళలకు ప్రతి నెలా రూ.1500 అందించే పథకమే 'ఆడబిడ్డకు నిధి'. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) పార్టీలు సూపర్ సిక్స్ హామీల్లో దీన్ని చేర్చాయి. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రతి మహిళకు ఏడాదికి రూ.18,000 అందుతాయి.
ఇప్పటికే తల్లికివందనం కింద చదువుకునే పిల్లలున్న ప్రతి తల్లికి రూ.13,000 చొప్పున నగదు సాయం అందుతోంది. ఎంతమంది పిల్లలుంటే అన్ని 13,000 రూపాయలు ఖాతాలో పడుతున్నాయి. ఇప్పుడు ఈ మహిళలకు ఆర్థిక సాయం కూడా అమలయితే అదనంగా మరో 18,000 రూపాయలు దక్కనున్నాయి. అంటే చదువుకునే ఓ కొడుకో, కూతురో ఉన్న తల్లికి ఏడాదికి రూ.31,000 రూపాయలు అందుతాయన్నమాట.
ఈ పథకాలు ఇలాగే అమలయితే 18 ఏళ్ల నుండి 59 ఏళ్లవరకు డబ్బులే డబ్బులు వస్తాయి. 60 ఏళ్లనుండి వృద్ధాప్య పించను వస్తుంది. అంటే మహిళలకు జీవితాంతం ఏదో రూపంలో ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందుతూనే ఉంటుందన్నమాట.