YS Jagan: ఇది కృష్ణుడు గీతలో చెప్పింది కాదు, జగన్ మోహన్ రెడ్డి కడపలో చెప్పింది. ఇది 'జగన్ విషాద యోగం'.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి.? వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనకాల అర్థం ఏంటి.? జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే ఓడిపోయారా.? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను పత్రి వాసుదేవన్ ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

విషాద యోగాలు రెండు రకాలు ... ఒకటి కపోల కల్పితం... రెండోది ప్రారబ్ధ ఫలితం ... ఈ రెండూ కానిది ఇంకోటి ఉంది... దాని పేరు జగన్మోహన విషాద యోగం.. ఇది పరమాత్ముడు గీతలో చెప్పింది కాదు ... జగన్మోహన రెడ్డి గారు కడపలో చెప్పింది ... తన విషాదాన్ని తానె రాసుకునే స్వేచ్ఛ ఆయనకు ఆయన నమ్మే భగవంతుడే ఇచ్చినందువల్ల, ఇందులో వేరెవరినీ పాత్రధారులుగానూ, సూత్రధారులు గానూ చేయాల్సిన అవసరం లేదు. ఆయన తరచూ చెప్పే సప్త సముద్రాల ఆవలకు శత్రువులను తరిమేస్తాననే ఫార్ములా ను కాసేపు పక్కన పెడితే. తన చుట్టూ ఉన్న కోటరీ ఏడు అగడ్తలను సృష్టించి. అయన దగ్గరకు నిజాలు, వాస్తవాలు చేరవేసే పౌర వ్యవస్థలను ఎలా ధ్వంసం చేస్తోందో ముందుగా ఆయన తెలుసుకోవాల్సింది. మనకు నిజాలు నచ్చవు.. భజనలు, భజన బృందాలతో సభను సంతృప్తి పరిచే సమూహాలు మాత్రమే నచ్చుతాయి.

తన జేబులో ఒడిసి పట్టుకున్న 40 శాతం ఓటు బ్యాంక్ మాత్రమే తనను గట్టున పడేస్తుందనే ఒక భ్రాంతి విపరీతంగా కమ్మేసిన ఈ మాజీ ఏలిక ...తన చుట్టూ ఉన్న చీలిక సామంతుల బృంద గానాలు, విపరీత చేష్టలను అర్ధ నిమీలిత నేత్రాలతో ఆస్వాదిస్తుంటే... అది విషాద యోగం కాక మరేమిటి ..? ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో (అది ఆయన కోటరీ ఎంపిక )మాట్లాడుతూ ..వారే మీడియా అనుకుంటూ భ్రమిస్తున్న జగన్మోహన రెడ్డి గారు.. తనను అభిమానించే జనానికి కోటి సూర్యుల దూరంలో ఉన్నారంటే.. లేదా ఉంచబడుతున్నారంటే... ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు .
ఆయన అధికారంలో ఉన్నపుడు ఆయన చుట్టూ చేరి ఏ దో పదవి దక్కించుకుందామనే పండిత ప్రకాండులు ఇప్పుడు పూర్తిగా తెరమరుగు, కనుమరుగు అయిన తర్వాత ... మిగిలిన తాలు మిరపకాయలనే అవధూతలుగా భావిస్తూ ... వారు చెప్పిందే భగవత్ సందేశం గానూ, ఆదేశంగానూ, అనుగ్రహ భాషణంగా నూ భావిస్తూ.... తనలో తాను రమించే ఈ యువ నాయకుడు ...ఈ రాష్ట్రానికి ఏం దిశా నిర్దేశం చేయగలడు..?? జగన్మోహన రెడ్డి గారికి ఇది నచ్చకపోవచ్చు గాక.. 40 శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు అని ఆయన భావిస్తూ ఉండవచ్చు గాక.. అది నిజమూ అయ్యుండొచ్చు గాక.. ఇన్ని `గాక'ల తర్వాత .... ఇవాళ పార్టీ కార్యకర్తలు, ఆయన పార్టీతో సంబంధం లేక పోయినా అసంఖ్యాకంగా ఉన్న ఆయన అభిమానులూ పొలికేక పెడుతుంటే.. ఆయన కు వినిపించటం లేదా ??
పార్టీ అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, విడుదల రజని ...ఇత్యాదులుగా ఉన్న అనేక కేసులు ఎదుర్కుంటున్న నాయకులు కాదు.. ఆయనకు ఓటేసిన కోటీ ముప్పై లక్షల మంది సామాన్య ప్రజలు .. ఈ వాస్తవాన్ని మర్చిపోయి తనకు తానుగా విషాద యోగాన్ని సృష్టించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు.. 2029 మీకు నల్లేరు మీద నడక కాదు.. మీరు వ్యక్తిగత శత్రువులుగా చూసే మీ వైరి పక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ...ఇలాంటి వారందరి సామూహిక శక్తి ముందు మీ పార్టీ ఎలా భస్మీ పటలం అయిపోయిందో మీ కళ్ళకు కనపడటం లేదా ?
అన్న నడిచొస్తే మాస్.. అన్న జైలులో ఉన్న వంశీ ని పరామర్శించటానికి వస్తే అదుర్స్...అంటూ క్యాప్షన్స్ పెట్టి విజిల్స్ వేసే మీ సోషల్ మీడియా మిమ్మల్ని గట్టెక్కించదు జగన్మోహన రెడ్డి గారూ.. ఢిల్లీ స్థాయిలో కూటమి చేస్తున్న మీడియా మేనేజ్మెంట్ ముందు మీ పరిమిత దిగ్గజ బృందాల స్థాయి సరిపోవడం లేదు ... అది మీకు తెలుస్తోందా ... ?? హిందూ వ్యతిరేక భావజాలానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అంటూ దేశ వ్యాప్తంగా జరిగిన ప్రచారాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోయిన మీ నిస్సహాయత మీ విషాద యోగంలో మొదటి అంకం అయితే.. ఇంకా ఇలాంటివి 99 ఉన్నాయి.. ఇదొక ధారా వాహిక .. ఈ అభిప్రాయాలు జగన్మోహన రెడ్డి గారి అభిమానులకు నచ్చకపోవచ్చు గాక .. కానీ ఇవి వాస్తవాలు.. రేపటి సూర్యోదయమంత నిజాలు