ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన ‘’అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం'' ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి గురించి ఆసక్తికర ప్రకటనలు చేశారు.
Alluri Sitarama Raju International Airport : ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్) సాకారం అయ్యింది. రూ. 5,600 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (ఆగస్ట్ 1, శనివారం) ఘనంగా ప్రారంభించారు. కేంద్ర విమానయాన శాఖ, GMR సంస్థతో కలిసి నిర్మించిన ఈ ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేశారు.
విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దిన కళాకృతులు చూసి ముగ్దుడయ్యారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్ అశోక గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితర ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రధానికి పొందూరు ఖద్దరు, బొబ్బిలి వీణతో సత్కారం
అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభాస్థలికి చేరుకున్న ప్రధానికి ప్రత్యేక స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లతో కలిసి ఓపెన్ జిప్‌లో సభాస్థలికి చేరుకున్నారు మోదీ. ఈ క్రమంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యంతో వారికి స్వాగతం పలికారు... ఇది గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పింది. ఇక దారిపొడవునా పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ప్రధాని అభివాదం చేశారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రసిద్ధ బొబ్బిలి వీణను బహూకరించి, పొందూరు ఖద్దరు శాలువాతో ఘనంగా సత్కరించారు సీఎం చంద్రబాబు.
"అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభం
సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని "అందరికీ నమస్కారం" అంటూ తెలుగులో ప్రారంభించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. పవిత్ర మాసంలో ఉత్తరాంధ్ర పుణ్యభూమిపై అడుగుపెట్టడం, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి పాదాలకు నమస్కరించుకునే భాగ్యం కలగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై ఆయన పేరిట విమానాశ్రయం రావడం ఆనందదాయకం అన్నారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వేగా, ఇక్కడి యువత భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో కేవలం విమానాశ్రయ ప్రారంభోత్సవమే కాదు ఏకంగా రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయన్నారు ప్రధాని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతుందో తెలియజేసేందుకు నిదర్శనం అన్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రధాని విమర్శలు..
గతంలో ప్రతి విమానాశ్రయానికి ఒకే కుటుంబం పేరు పెట్టేవారని... ఆ కల్చర్ ను ఎన్డిఏ ప్రభుత్వం పూర్తిగా మర్చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవలే అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పెట్టామని తెలపారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ వెల్లడించారు.
ఇక ఎన్డిఏ అధికారంలోకి వచ్చేనాటికి అంటే 2014 వరకు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని.. గడిచిన 12 ఏళ్లలో ఆ సంఖ్య 166కు చేరిందన్నారు. ఉడాన్-2 (UDAN) పథకం కింద రూ. 29 వేల కోట్లు వెచ్చించి చిన్న చిన్న ప్రాంతాల ప్రజలకు, సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
వికసిత్ భారత్ లో ఏపీ గ్రోత్ ఇంజన్
వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక కీలక గ్రోత్ ఇంజన్‌గా నిలిచే సామర్థ్యం కలిగి ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌ను ప్రశంసిస్తూ, ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తారని తెలిపారు.
ఏపీ యువత గ్లోబల్ లెవల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు... ఏపీ కేవలం ఐటీ రంగానికే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతోందని అన్నారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ యూనిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
ఇక విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు పోర్టుల ఆధునీకరణతో పాటు రామాయపట్నం, మూలపేటల్లో కొత్త పోర్టుల నిర్మాణం వేగవంతమవుతోందన్నారు. ఏపీలో రూ. 1 లక్ష కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని మోదీ తెలిపారు.
నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం భారీ బల్క్ ఫార్మా పార్క్‌ను ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల ఏపీ ఫార్మా హబ్‌గా మారుతుందని చెప్పారు. అలాగే రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. "ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి ఎంప్లాయ్‌మెంట్" అనేదే తమ ప్రభుత్వ మంత్రం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
ఇక భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విమాన రాకపోకలకు సంబంధించి ఎయిర్ ఇండియా సంస్థ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు రోజువారీ సర్వీసులు ఇలా ఉండనున్నాయి.
హైదరాబాద్ - భోగాపురం: రోజుకు 5 సర్వీసులు
విజయవాడ - భోగాపురం: రోజుకు 4 సర్వీసులు
బెంగళూరు - భోగాపురం: రోజుకు 2 సర్వీసులు
13 వేల మంది గిరిజన బాలికల 'థింసా' నృత్యం – గిన్నిస్ ప్రపంచ రికార్డు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ 'థింసా నృత్యం' ప్రపంచ రికార్డు సృష్టించింది. 13 వేల మంది గిరిజన బాలికలు ఏకకాలంలో పాల్గొని ప్రదర్శించిన ఈ థింసా నృత్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ధృవీకరించారు. అనంతరం సంబంధిత గిన్నిస్ రికార్డు అవార్డును రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి అందజేశారు. స్వయంగా థింసా నృత్యంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణిని, గిరిజన మహిళా కళాకారులను ప్రధాని మోదీ తమ ప్రసంగంలో ప్రత్యేకంగా అభినందించారు.

