ఈ ఉంగరం పెట్టుకుంటే గోల్ కొడతావ్! యంత్రం జేబులో ఉంటే మ్యాచ్ గెలిచినట్టే!! భారత ఫుట్బాల్ కు జ్యోతిష్య మెరుగులు
Astrologer for Indian Football team: ఇటీవలే ముగిసిన ఆసియా కప్ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ పోటీలకు ముందు..
అసలే అరకొర వసతులు, చాలీచాలని జీతాలు, భూతద్దం వేసి చూసినా దొరకని ఆటగాళ్లు.. వెరసి ప్రపంచ ఫుట్బాల్ ప్రస్థానంలో భారత జట్టు పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఐదారేండ్లుగా స్థానికంగా లీగ్స్ వల్ల ఈ గేమ్ కు కాస్త క్రేజ్ పెరుగుతున్న తరుణంలో ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF) తీసుకుంటున్న నిర్ణయాలు ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మన ఫుట్బాల్ ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా కాకుండా జ్యోతిష్య శాస్త్రం, జ్యోతిష్కుల జోక్యంతో భారత జట్టు విజయాలను ఖరారు చేస్తున్నది ఏఐఎఫ్ఎఫ్.
తాజాగా ఆసియా కప్ విజయంలో ఆటగాళ్ల కష్టం కంటే జ్యోతిష్కుల మాటకే ఎక్కువ విలువిచ్చింది. ఆసియా కప్ లో భారత జట్టు విజయాలను అంచనా వేయడానికి గాను ఓ ఆస్ట్రాలజీ ఏజెన్సీకి ఏఐఎఫ్ఎఫ్ ఏకంగా రూ. 16 లక్షలను చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇన్సైడ్ స్పోర్ట్స్ లో వచ్చిన కథనం మేరకు.. ఆసియా ఫుట్బాల్ కప్ (ఏఎఫ్సీ) లో క్వాలిఫికేషన్ కోసం ఇటీవలే ముగిసిన అర్హత రౌండ్ల మ్యాచులలో భారత జట్టుకు ప్రేరణ కల్పించుకునేందుకని AIFF ఓ జ్యోతిష్కుడిని నియమించుకుంది. అతడికి ఏకంగా రూ. 16 లక్షలు చెల్లించినట్టు తెలుస్తున్నది.
ఇదే విషయమై జట్టులోని ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ కు ముందు జాతీయ జట్టు కోసం ఓ జ్యోతిష్కుడి (మోటివేటర్) ని నియమించారు. అతడి పని జట్టుకు ప్రేరణ కలిగించడం. ఇందుకోసం అతడికి రూ. 16.1 లక్ష రూపాయలు వెచ్చించారు’ అని తెలిపాడు. సదరు మోటివేటర్ భారత జట్టుతో మూడు సెషన్ల పాటు క్లాస్ తీసుకుని మన ఆటగాళ్లలో ‘ప్రేరణ’ కలిగించాడని కోల్కతా కు చెందిన ఓ ఫుట్బాలర్ తెలిపాడు. అతడు మాట్లాడుతూ.. ‘నేను టీమ్ లో జాయిన్ అయినప్పట్నుంచి ఇలా జరగడం ఇదే ప్రథమం..’ అని చెప్పాడు. అయితే ఈ విషయంపై స్పందించడానికి AIFF జనరల్ సెక్రటరీ సునందో ధార్ మీడియాకు అందుబాటులోకి రాలేదు.
ఇక AIFF చేసిన నిర్వాకానికి గాను మాజీ ఇండియా గోల్ కీపర్ తనుమోయ్ బోస్ స్పందిస్తూ.. ‘దేశంలో యూత్ లీగ్ లను కండక్ట్ చేయడంలో దారుణంగా విఫలమైన AIFF.. ఇలా చేయడం సిగ్గుచేటు. భవిష్యత్ లో ఇది భారత ఫుట్బాల్ ప్రతిష్టను దిగజార్చుతుంది..’ అని వ్యాఖ్యానించాడు. ఇక ఏఐఎఫ్ఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ట్విటర్ లో నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. మరో రూ. 16 లక్షలిస్తే భారత ఫుట్బాల్ జట్టు ప్రపంచకప్ కు అర్హత సాధిస్తుంది కదా..? అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.
ఆసియా కప్ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భాగంగా ఇటీవలే హంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా ఆసియా కప్ 2023 టోర్నీలోపాల్గొనబోతోంది.