వారాహి మాత హిందూమతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. నేపాల్ లో ఆమెని బరాహీ అని పిలుస్తారు. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దండినిగా పూజిస్తారు. వారాహి మాత వరాహుడి నుండి సృష్టించారని అంటారు. అందుకే ఆమె పంది రూపాన్ని కలిగి ఉంటుందని చెబుతారు. 

దుర్గాదేవి తన నుండి కొన్ని మాతృకులను సృష్టించిందని అలా పుట్టిన మాతృకలలో వారాహి కూడా ఒకరిని చెబుతారు. వామన పురాణం ప్రకారం చండికా దేవి వీపు నుండి వారాహి దేవి ఉద్భవించిందని అంటారు. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి దేవిని వరాలను ఇచ్చే మాతగా చెబుతారు. అలాగే ఉత్తర దిశకు అధిపతి అని అంటారు.మాతృకలను దిక్కులను రక్షించే రక్షకులుగా వివరిస్తారు. అయితే వారాహి దేవిని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. రాత్రివేళ ఆమెను పూజించడం వల్ల ఆమె శక్తి స్వరూపంగా మారుతుందని రాత్రి వేళల్లో చైతన్యవంతం అవుతుందని నమ్ముతారు. ఆ సమయంలోనే తిరిగే దుష్టశక్తుల నుంచి మనుషులను రక్షిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

రాత్రివేళ వారాహి పూజ

వారాహి దేవి శక్తి స్వరూపంతో సమానంగా కొలుస్తారు. భక్తులను అన్ని కష్టాల నుంచి రక్షించే శక్తి వారాహి దేవికి ఉందని నమ్ముతారు. రాత్రివేళలో చీకటిగా ఉంటుంది. ప్రతికూల శక్తులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ సమయంలో వారాహిమాతను పూజించడం వల్ల ఆ ప్రతికూల శక్తుల నుండి భక్తులను రక్షిస్తుందని ఎంతోమంది నమ్మకం. అంతేకాదు రాత్రివేళ వారాహిమాతను పూజించడం వల్ల ఏకాగ్రత అధికంగా ఉంటుందని. భక్తి భావన కూడా ఎక్కువగా పెరుగుతుందని నమ్ముతారు. రాత్రివేళ వారాహిమాతను పూజిస్తే భక్తులు ఆధ్యాత్మిక ప్రయాణంలో మునిగిపోతారని అందుకే అదే ఉత్తమ సమయాన్ని చెబుతారు. రాత్రివేళలో కొంతమంది దేవతలను పూజించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి అని నమ్ముతారు. వారాహిమాతను కూడా రాత్రివేళ పూజిస్తే మంచి ఫలితాలు అధికంగా దొరుకుతాయని వివరిస్తారు.

వారాహి మాత రూపం వరాహమూర్తిలాగే ఉంటుంది. ఈమె శరీరం నల్లని ఛాయను కలిగి ఉంటుంది. ఇక ముఖం వరాహరూపంలో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. ఒక్కొక్క చేతిలో శంఖ, పాశము ఇలా ఆయుధాలు కూడా ఉంటాయి. అలాగే వారాహి తల్లి గుర్రం, సింహము, దున్నపోతు, పాము ఇలా అనేక వాహనాలు మీద సంచరిస్తూ ఉంటుందని అంటారు.

సైన్యాధిపతి వారాహి దేవి

లలితా మాతకు సైన్యాధిపతి వారాహి దేవి అని చెప్పుకుంటారు. అందుకే లలితా సహస్రనామంలో కూడా వారాహి దేవి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ తల్లి తరఫున పోరాడేందుకు, భక్తులను కాపాడేందుకు వారాహి దేవి గొప్ప యోధులుగా నిలుస్తుందని అంటారు. ఈ మాతను ఆరాధిస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయని చెబుతారు. జ్ఞానం సిద్ధించి, శత్రుభయం కూడా తొలగిపోతుందని అంటారు. వారాహి దేవి మూలమంత్రాలను అప్పుడప్పుడు జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

విష్ణువు రూపం

పూర్వం ఒకప్పుడు భూలోకాన్ని హిరణ్యక్షుడు అనే రాక్షసుడు విపరీతంగా బాధించేవాడు. దేవతల అందరిని ఓడించి హిరణ్యాక్షుడే గెలిచి నిలిచాడు. దీంతో దేవతలంతా విష్ణువుని శరణు కోరారు. విష్ణువు వరాహమూర్తి అవతారంలో భూలోకానికి వచ్చాడు. ఆ వరాహమూర్తికి స్త్రీ రూపమే వారాహి మాత అని చెప్పుకుంటారు. వారాహిమాతే రక్తబీజుడు, శంభునిశుంబులు, అంధకాసురుడు వంటి రాక్షసులను అంతమొంచిందని కథలు చెబుతారు.